ఈ మధ్యే రాజకీయ రంగ ప్రవేశం చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్‌ హిమాలయాలకు వెళ్లారు. గత దశాబ్దకాలంగా ప్రతియేటా రజనీకాంత్‌ హిమాలయాలకు వెళ్లి అక్కడ ధ్యానం చేసుకుంటూ వస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని దునాగిరి గుహలలో రజనీకాంత్‌ ధ్యానం చేసుకుంటారు. ప్రతియేటా తన జీవితంలోని ఏదో ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని ఎంచుకుని రజనీకాంత్‌ హిమాలయాలకు వెళ్లి వస్తుంటారు. గతేడాది రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రోబో 2.0 సినిమా కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలోనే  ఆయన హిమాలయాలకు వెళ్లారు. విమానాశ్రయంలో రజనీకాంత్‌ తన పర్యటన గురించి వివరాలేమీ వెల్లడించలేదు. కానీ తన అభిమానులతో రెండు వారాలపాటు తాను అందుబాటులో ఉండనని చెప్పారని సమాచారం.


ర‌జినీ హిమాల‌యాల‌కు వెళ్ళిరావడం ఇదేం కొత్తేమీ కాదు. ప్రతి ఏడాది అక్కడికి వెళ్లి కొన్ని రోజులు ధ్యానం చేసుకుని వస్తున్నారు సూప‌ర్ స్టార్. రజినీకాంత్ కొంత మంది స్నేహితులతో కలిసి అక్కడే స్థలాన్ని కొని ఆశ్రమం కట్టించారు. ప్రస్తుతం ఈ ఆశ్రమం కట్టడం పూర్తయింది. ఈ ఆశ్రమం భక్తులకూ అందుబాటులో రానుంది. కాలా, 2.0 సినిమాలు పూర్యయ్యాయి కనుక సేదతీరడానికి సమయం దొరికింది కాబట్టి హిమాలయాలకు వెళ్లారు. హిమాలయాలకు వెళ్లి వచ్చిన తరువాత కార్తిక్ సుబ్బరాజ్ సినిమాతో బిజీ కానున్నారు. అలానే రాజ‌కీయ కార్యక్రమాల్లోనూ బిజీ కానున్నారు. ర‌జినీకాంత్ ఇప్పటికే వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌బోయే సార్వత్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా సంకేతాలు ఇచ్చారు. కాబట్టి  వీలైనంత త్వరగా కార్తిక్ సుబ్బరాజ్ తో సినిమా పూర్తిచేసుకొని.. పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నారు రజినీ.