బాహుబలి సినిమాతో బాలీవుడ్‌లోనూ ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ప్రభాస్‌తో కలిసి నటించడానికి బాలీవుడ్ హీరోయిన్స్ ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు అని చెప్పడానికి మరో ఉదాహరణే ఈ బాలీవుడ్ నటి మనసులో మాట. అవును, బాహుబలి సినిమా రిలీజై ఏడాది దాటిపోయింది. ఈ మధ్య కాలంలో అతడి సినిమాలు మళ్లీ ఏవీ రిలీజ్ కాలేదు. అయినప్పటికీ ఆ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన ప్రభాస్‌పై మాత్రం బాలీవుడ్ హీరోయిన్స్‌కి క్రేజ్ పోవడం లేదు. అందుకే అవకాశం వస్తే, ప్రభాస్‌తో నటించడానికి తాము రెడీ అంటున్నారు బాలీవుడ్ నటీమణులు. తాజాగా హైదరాబాద్ వచ్చిన బాలీవుడ్ నటీమణి స్వర భాస్కర్ టాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.. తనకు తెలుగులో సినిమాలు చేయాలని ఉందని, అది కూడా ప్రభాస్ సినిమాతోనే తెలుగు వారికి పరిచయం కావాలని ఉందని మనసులో మాటను బయటపెట్టింది. ప్రభాసే ఎందుకు అని అడిగితే, అతడు చాలా హాట్ అని కుండబద్ధలు కొట్టినట్టు ఏ మాత్రం తడుముకోకుండా చెప్పేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అవును, మాట్లాడటంలో ఫైర్ బాంబ్‌లా పేరున్న అతి కొద్దిమంది హీరోయిన్స్‌లో స్వర భాస్కర్ కూడా ఒకరు. పద్మావత్ సినిమా చూసి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా, ఇటీవలే రిలీజైన వీర్ ది వెడ్డింగ్ సినిమాలో స్వయంతృప్తి పొందే సన్నివేశంలో నిర్మోహమాటంగా నటించడమే కాకుండా అందులో తప్పేముంది అని తన నటనను సమర్ధించుకున్నా అది ఆమెకే చెల్లింది. అందుకే ప్రభాస్ చాలా హాట్‌గా ఉంటాడు అని చెప్పడానికి కూడా ఏ మాత్రం వెనుకాడలేదు స్వర భాస్కర్. అంతేకాకుండా తన తండ్రి కూడా తెలుగు మూలాలు ఉన్న వ్యక్తేనని చెబుతూ అప్పుడే తెలుగు వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టింది. 


ప్రస్తుతం రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సెట్స్‌పై ఉన్న సాహో సినిమాలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పుడు స్వర భాస్కర్ మనసులో మాటను బయటపెట్టింది కనుక తర్వాత అతడితో చిత్రాలు చేసే తెలుగు దర్శకులు ఎవరైనా ఆమెను తీసుకుంటారేమో చూద్దాం.