ప్రముఖ తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చంద్రమౌళి ఇక లేరు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చంద్రమౌళి ఇవాళ తుది శ్వాస విడిచారు. చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రమౌళి 1971లో తొలిసారిగా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. దాదాపు ఐదు దశాబ్ధాల సినిమా కెరీర్‌లో చంద్రమౌళి సుమారు 150కుపైగా చిత్రాల్లో నటించారు. చంద్రమౌళి నటించిన సినిమాల్లో చాలాశాతం వరకు ఆయన చేసినవి చిన్న చిన్న పాత్రలే అయినా.. ఆ పాత్రలకు ఆయన మాత్రమే న్యాయం చేయగలరు అనేంత గొప్పగా నటించి మెప్పించారు. అందువల్లే చిన్నచిన్న పాత్రలు చేస్తూనే ఐదు దశాబ్ధాల కాలంపాటు చంద్రమౌళి సినీ రంగంలో కొనసాగుతూ వచ్చారు. 


సినీ నటుడు చంద్రమౌళి మృతి వార్త తెలుసుకున్న తెలుగు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దాదాపు తెలుగులో అందరూ అగ్రహీరోల సినిమాల్లో హీరోలకు దగ్గరిగా మెదిలే పాత్రల్లో నటించిన చంద్రమౌళితో నటీనటులు అందరికీ మంచి అనుబంధమే వుంది.