శ్రీరామనవమి వస్తుందంటే కోల్‌కతాలో గుర్రపు బగ్గీలను నడిపే ముస్లిం కార్మికులకు ఒక రకంగా పండగే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఊరేగింపుల విషయంలో గుర్రపు బగ్గీలకు ఆదరణ తగ్గిపోతున్న క్రమంలో.. ఈ పండగ నాడు ఇక్కడ వాటికి ప్రత్యేక డిమాండ్ ఉందట. గుర్రపు బగ్గీలను బాగా అలంకరించి.. వాటిని నాలుగు గంటల పాటు అద్దెకు ఇస్తే.. ఒక్కో బగ్గీకి వారికి వచ్చే ఆదాయం నాలుగు వేలకు పైమాటే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందుకే శ్రీరామనవమి రోజున ఈ బగ్గీలపై ఆధారపడేవారు నాలుగు షిఫ్టుల్లోనూ పనిచేయడానికి వెనుకాడరు. అయితే డెకరేషన్ బాధ్యత మాత్రం వారిది కాదు. ఎవరైతే బగ్గీ బుక్ చేసుకుంటారో.. వారే వచ్చి గుర్రపు బండిని డెకరేట్ చేసుకోవాలి. బండి యజమానులు కేవలం గుర్రానికి బాగా స్నానం చేయించి.. అలంకరించి తీసుకొస్తారు. కోల్‌కతాలో పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు గుర్రపు బండ్లను సప్లై చేసే కాంట్రాక్టుల్లో 90 శాతం మందికి పైగా ఉన్నవారు ముస్లిములే కావడం గమనార్హం.


సాధారణంగా చాలామంది ప్రజలు ఒకప్పుడు ప్రత్యేకంగా డిజైన్ చేసిన గుర్రపు బగ్గీలంటే పడి చచ్చేవారంట. వాటిపై ఎక్కడాన్ని సరదాగా భావించేవారట. అలాగే కోల్‌కతాకి వచ్చే విదేశీయులు కూడా వీటిపై అమితమైన ఇష్టాన్ని చూపించేవారు. అయితే ఇప్పుడు ఆ రోజులు పోయాయని అంటున్నారు వాటి మీద ఆధారపడి జీవిస్తున్న కార్మికులందరూ.


అటువంటి సందర్భంలో శ్రీరామనవమి నాడు విగ్రహాలను ఊరేగించడానికి వచ్చే కాంట్రాక్టులు తప్పించి.. తమకు వేరే ఆదాయం ఉండడం లేదని వారు వాపోతున్నారు. ఈ బగ్గీలు నడపడానికి ముందు గుర్రాలను కొనాలంటే బిహార్‌లోని సోనేపూర్‌కి వెళ్లి వాటిని కొనేవారట. ప్రస్తుతం ఒక్కో గుర్రానికి రూ.40,000 రేటు పలుకుతుందని అంచనా. అలాంటి వాటిని మేపడానికి, శుభ్రం చేయడానికి, అలంకరించడానికి సంవత్సరం ఖర్చు దాదాపు రూ.3.5 లక్షలు అవుతుందని కూడా అంటున్నారు. అందుకే ఇప్పటి రోజుల్లో ఈ బిజినెస్ వైపు ఎవరూ ఎక్కువ మొగ్గుచూపడం లేదట.