సినీ స్టార్ల జీవితాలను తెరపై ఆవిష్కరించిన టాప్ టెన్ చిత్రాలివే..!
సినీ స్టార్ జీవితం అంటే ఆషామాషీ కాదు. వారి రంగుల ప్రపంచంలో కూడా అగచాట్లు, వ్యధలు ఉంటాయి. బయట ప్రపంచానికి తెలియని కథలు ఎన్నో వారి జీవితపు ఛాయల మాటున సామాన్య జనానికి తెలియకుండా చిక్కుకుపోయి ఉండవచ్చు
సినీ స్టార్ జీవితం అంటే ఆషామాషీ కాదు. వారి రంగుల ప్రపంచంలో కూడా అగచాట్లు, వ్యధలు ఉంటాయి. బయట ప్రపంచానికి తెలియని కథలు ఎన్నో వారి జీవితపు ఛాయల మాటున సామాన్య జనానికి తెలియకుండా చిక్కుకుపోయి ఉండవచ్చు. వాటిని బహిర్గతం చేస్తూ.. వారి జీవితాలనే బయోపిక్స్‌గా తెరకెక్కించడం కూడా ఒక సవాలే. నాటి శ్యామ్ బెనగళ్, మణిరత్నం నుండి నేటి నాగ్ ఆశ్విన్ వరకు పలువురు దర్శకులుగా ఈ ప్రయత్నాలు చేసి సక్సెస్ సాధించినవారే. ఈ క్రమంలో సినీ స్టార్ల జీవితాలను తెరపై ఆవిష్కరించిన టాప్ టెన్ చిత్రాల గురించి తెలుసుకుందామా..!
భూమిక - ప్రముఖ మరాఠీ నటి హంసా వాడ్కర్ జీవితకథ ఆధారంగా స్మితా పాటిల్ టైటిల్ రోల్ పోషించిన చిత్రం "భూమిక". 1977లో విడుదలైన ఈ చిత్రానికి లెజెండరీ డైరెక్టర్ శ్యామ్ బెనగళ్ దర్శకత్వం వహించారు. పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో కూడా ఈ చిత్రం ప్రదర్శితమైంది.
మయూరి - ప్రముఖ నటి సుధాచంద్రన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం "మయూరి". ఈ చిత్రాన్ని రామోజీరావు నిర్మించగా.. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సుధా చంద్రన్ తన పాత్రలో తానే నటించడం గమనార్హం. 14 నంది అవార్డులను కైవసం చేసుకున్న ఈ చిత్రం.. దివ్యాంగురాలైన ఓ యువతి ఎన్ని అగచాట్లు పడి మంచి నర్తకిగా రాణించిందన్న కథాంశంతో తెరకెక్కింది. 1985లో విడుదలైంది ఈ చిత్రం. ఇదే చిత్రం "నాచే మయూరి" పేరుతో హిందీలో కూడా రీమేక్ చేయబడింది.
ఇద్దరు - ప్రముఖ తమిళ నటుడు, రాజకీయవేత్త ఎంజీ రామచంద్రన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన "ఇరువర్" అనే తమిళ చిత్రం తెలుగులో "ఇద్దరు" పేరుతో విడుదలైంది. ఈ చిత్రంలో కరుణానిధి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపిస్తారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1997లో విడుదలైంది.
సెల్యూలాయిడ్ - మలయాళ చిత్ర పితామహుడిగా పేరుగాంచిన జేసీ డేనియల్ జీవితకథ ఆధారంగా కమల్ దర్శకత్వంలో 2013లో తెరకెక్కిన చిత్రం "సెల్యూలాయిడ్". ఈ చిత్రంలో డేనియల్ పాత్రలో నటుడు పృథ్వి రాజ్ కనిపిస్తారు.
అభినేత్రి- అలనాటి కన్నడ నటి కల్పన జీవితకథ ఆధారంగా, 2015లో విడుదలైన కన్నడ చిత్రం "అభినేత్రి". ఈ చిత్రంలో పూజాగాంధీ, కల్పన పాత్రను పోషించారు. అయితే ఇదే చిత్రం పలు వివాదాల బారిన కూడా పడింది. కన్నడ దర్శకుడు పుట్టన్న కనగళ్ పాత్రని ఈ చిత్రంలో వక్రీకరించి చూపారని ఆయన కుమార్తె కోర్టులో పిటీషన్ వేశారు.
ఏక్ అల్బేలా - హిందీ చిత్ర పరిశ్రమలో 1940ల్లో మంచి నటుడిగా, దర్శకుడిగా కూడా పేరొందిన భగవాన్ దాదా జీవితకథ ఆధారంగా తెరకెక్కిన మరాఠీ చిత్రమే "ఏక్ అల్బేలా". 1951లో వచ్చిన "అల్బేలా" చిత్రంతో బాగా పాపులరైన భగవాన్ దాదా జీవితంలో జరిగిన పలు సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. "ఏక్ అల్బేలా" చిత్రంలో భగవాన్ దాదా పాత్రను మరాఠీ నటుడు మంగేష్ దేశాయ్ పోషించారు. "ఏక్ అల్బేలా" చిత్రం 2016లో విడుదలైంది.
డర్టీ పిక్చర్ - నటి సిల్క్ స్మిత జీవితం ఆధారంగా విద్యా బాలన్ కథానాయికగా నటించిన చిత్రం "డర్టీ పిక్చర్". మిలన్ లుత్రియా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2011లో విడుదలైంది. మూడు జాతీయ అవార్డులను కూడా కైవసం చేసుకుందీ చిత్రం.
మహానటి - అలనాటి నటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెలుగులో నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "మహానటి". 2018లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ చిత్రంలో నటి కీర్తి సురేష్, సావిత్రి పాత్రలో నటించారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సావిత్రి భర్త జెమినీ గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించారు.
సంజూ - రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ టైటిల్ రోల్ పోషించిన చిత్రం "సంజూ". బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇదే చిత్రంలో సంజయ్ దత్ తల్లి నర్గీస్ దత్ పాత్రలో మనీషా కొయిరాలా, తండ్రి సునీల్ దత్ పాత్రలో పరేష్ రావెల్ నటించారు. 2018లో ఈ చిత్రం విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
షకీలా - మలయాళం సినీ పరిశ్రమలో ఒకప్పుడు అడల్ట్ చిత్రాలతో పాపులారిటీ సంపాదించుకున్న నటి షకీలా. తన జీవితంలోని వ్యధలను, వాస్తవాలను బహిర్గతం చేయడానికి ఆమె కథనే సినిమాగా కూడా తీయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో టైటిల్ రోల్‌లో నటి రిచా చద్దా నటించే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి.
ఎన్టీఆర్ బయోపిక్ - నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ఆయన కుమారుడు నందమూరి బాలక్రిష్ణ కథానాయకుడిగా నటిసోన్న చిత్రం "ఎన్టీఆర్". ఈ చిత్రానికి దర్శకుడిగా తొలుత తేజను అనుకున్నా.. ప్రస్తుతం ఆయన ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.