మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం "సైరా నరసింహారెడ్డి". ఈ చిత్రంలో ప్రముఖ తెలుగు రచయిత త్రిపురనేని గోపిచంద్ కుమారుడు సాయిచంద్ ఓ ప్రధానమైన పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ ముఖ్యమైన పాత్ర కోసం నిర్మాతలు సాయిచంద్‌ని సంప్రదించగా.. ఆయన అంగీకరించినట్లు కూడా సమాచారం. సాయిచంద్ ఇటీవలే "ఫిదా" చిత్రంలో కథానాయిక సాయిపల్లవికి తండ్రిగా నటించారు. గతంలో కూడా మంచుపల్లకి చిత్రంలో ఆయన చిరంజీవి మిత్రుడి పాత్రలో నటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మా భూమి, పెళ్లీడు పిల్లలు, ఆడవాళ్లు అలిగితే, రంగుల కల, శివ, అంకురం, ఈ చరిత్ర ఏ సిరాతో, ఈ చదువులు మాకొద్దు, ఈ దేశంలో ఒక రోజు లాంటి చిత్రాలలో సాయిచంద్ మంచి నటనను కూడా కనబరిచి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. రచయిత త్రిపురనేని గోపిచంద్‌కు సాహిత్య అకాడమీ పురస్కారం సంపాదించి పెట్టిన "పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా" నవల దూరదర్శన్‌లో టెలిఫిలింగా రూపొందినప్పుడు సాయిచంద్ అందులో కథానాయకుడి పాత్రను కూడా పోషించారు. 


"సైరా" చిత్రాన్ని చిరంజీవి కుమారుడు రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానరుపై నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా నయనతార కథానాయికగా నటిస్తున్నారు. విజయ సేతుపతి, సుదీప్, రవి కిషన్, హ్యుమా ఖురేషి, జగపతిబాబు, బ్రహ్మాజీ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తమన్నా, ప్రగ్యా జైశ్వాల్ ఈ సినిమాలో మరో ఇద్దరు కథానాయికలు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో నటిస్తున్నారు.