తప్పకుండా తాను రాజకీయాల్లోకి వస్తానని తమిళ సినీనటి వరలక్ష్మీ శరత్ కుమార్ స్పష్టంచేసింది. ప్రముఖ సినీనటుడు శరత్ కుమార్ కూతురైన వరలక్ష్మి హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి ఇటీవల పందెం కోడి-2, సర్కార్ సినిమాల్లో లేడీ విలన్‌గా నెగటివ్ పాత్రలు పోషించింది. మొన్న విడుదలై సంచలనం సృష్టించిన సర్కార్ సినిమాలో వరలక్ష్మి పోషించిన మహిళా రాజకీయనాయకురాలి పాత్ర ఆమెకు ప్రశంసల వర్షాన్ని కురిపించింది. విమర్శకుల చేత శభాష్ అనిపించుకున్న ఆ పాత్ర గురించి ఓ ఇంటర్వ్యూలోనూ ప్రస్తావనకు వచ్చింది. సినిమాలో రాజకీయ నాయకురాలిగా నటించి, మెప్పించిన మీకు నిజ జీవితంలోనూ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా అని ప్రశ్నించగా అందుకు ఆమె నుంచి అవుననే సమాధానమే వచ్చింది. రానున్న మరో ఐదు లేదా పదేళ్లలో తాను తప్పకుండా రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని, అందులో ఎటువంటి సందేహం లేదని వరలక్ష్మి తేల్చిచెప్పింది.


ఇప్పటికే శరత్ కుమార్ రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఆమె బాయ్ ఫ్రెండ్‌గా ప్రచారంలో ఉన్న విశాల్ సైతం రాజకీయాల్లో రానించే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్లేనేమో ఇప్పుడు వరలక్ష్మి ఆలోచనలు సైతం ఆ రాజకీయాల చుట్టే తిరుగుతున్నాయి అని కోలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.