సినీ నిర్మాత కె.రాఘవ కన్నుమూత
ప్రముఖ సినీ నిర్మాత, ప్రతాప్ ఆర్ట్స్ అధినేత కె. రాఘవ గుండెపోటుతో మృతి చెందారు.
ప్రముఖ సినీ నిర్మాత, ప్రతాప్ ఆర్ట్స్ అధినేత కె. రాఘవ గుండెపోటుతో మృతి చెందారు. అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 105 ఏళ్లు.తూర్పు గోదావరి జిల్లా కోటిపల్లి అనే గ్రామంలో 1913లో కె.రాఘవ జన్మించారు. సుఖదుఃఖాలు, జగత్ కిలాడీలు, తాత మనవడు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, చదువు సంస్కారం, తూర్పు పడమర, అంతులేని వింతకథ, అంకితం వంటి అనేక చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు.
1972లో తాతమనవడు, 1973లో సంసారం సాగరం సినిమాలకు గాను ఆయనకు నంది అవార్డులు దక్కాయి. అక్కినేని జీవిత సాఫల్య పురస్కారంతో పాటు 2012లో రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డులతో ఆయన్ను సత్కరించారు. చిత్ర పరిశ్రమకు ఎందరో నూతన దర్శకులను, నటులు, సాంకేతిక నిపుణులను రాఘవ పరిచయం చేశారు. వారిలో దాసరి నారాయణరావు, ఎస్పీ బాలు, రావుగోపాల్‌రావు, కోడి రామకృష్ణ, గొల్లపూడి మారుతీరావు, సుమన్, భానుచందర్ తదితరులు ఉన్నారు. ట్రాలీ పుల్లర్‌గా, స్టంట్స్ మాన్‌గా పనిచేసిన రాఘవ ఆ తర్వాత ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. అలా అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ నిర్మాతగా మారారు. అలాగే రాఘవ పలు బాలీవుడ్ చిత్రాలను కూడా నిర్మించారు. రాఘవకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా రాఘవ మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.