ట్రంప్ విధానాలకు నిరసనగా `స్టాట్యూ ఆఫ్ లిబర్టీ` ఎక్కిన మహిళ..!
అమెరికాలోని కట్టడాలలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అరుదైన విగ్రహం `స్టాట్యూ ఆఫ్ లిబర్టీ`.
అమెరికాలోని కట్టడాలలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అరుదైన విగ్రహం "స్టాట్యూ ఆఫ్ లిబర్టీ". న్యూయార్క్ హార్బరు వద్ద ఉండే ఆ విగ్రహాన్ని ఎక్కే సాహసాన్ని ఇప్పటి వరకూ ఎవరూ చేయలేదు. అయితే ట్రంప్ అనుసరిస్తున్న "జీరో టాలరెన్స్" విధానాన్ని ప్రశ్నిస్తూ.. స్వేచ్ఛకి, డెమొక్రసీకి గుర్తుగా పలువురు పిలుచుకొనే ఆ విగ్రహాన్ని ఎక్కే సాహసాన్ని చేసింది ఓ మహిళ. నిచ్చెన వేసుకొని ఆ విగ్రహం పాదాల వరకు ఎక్కేసిన ఆమెను కిందకు దించడానికి పోలీసులు నానా కష్టాలు పడ్డారు. దాదాపు మూడు గంటలు పాటు శ్రమించి ఆమెను కిందకు తీసుకొచ్చారు.
ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషనుకి తరలించారు. ఆ ప్రాంతంలో అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలోనే ఈ ఘటన కూడా జరిగింది. కానీ వెంటనే స్పందించిన పోలీసులు ఈ సంఘటన జరిగాక.. ఆ విగ్రహాన్ని సందర్శించే మార్గాన్ని మూసివేశారు. టూరిస్టులను ప్రస్తుతానికి అనుమతించమని.. వెంటనే వెనక్కి తిరిగి వెళ్లిపోవాలని కోరారు.
44 ఏళ్ళ వయసున్న ఆ మహిళ కాంగో ప్రాంత వాసని.. 2000 మంది తల్లీ బిడ్డలను వేరుచేస్తున్న జీరో టాలరెన్స్ విధానాన్ని నిరసిస్తూ విగ్రహాన్ని ఆమె ఎక్కే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొంటున్న సమయంలో క్షమాపణ కోరిందని.. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను అలా ప్రవర్తించాల్సి వచ్చిందని చెప్పినట్లు పోలీసాఫీసర్ బ్రియన్ గ్లాకెన్ అమెరికన్ మీడియాకి తెలిపారు.