నందమూరి హరికృష్ణ హఠాన్మరణంతో ఇంకా తేరుకోని తెలుగు సినీ పరిశ్రమలో అప్పుడే మరో విషాదం చోటు చేసుకుంది. హరికృష్ణ అంత్యక్రియలకు హాజరైన సినీ ప్రముఖులు అలా ఇంటికి చేరుకున్నారో లేదో అప్పుడే వారికి మరో దుర్వార్త అందింది. తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న అతి కొద్దిమంది మహిళా డైరెక్టర్లలో ఒకరైన బి జయ కన్నుమూశారు. 54 ఏళ్ల వయస్సులో నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఆమె గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. పాత్రికేయురాలిగా కెరీర్ ప్రారంభించిన బి జయ 2003లో చంటిగాడు అనే సినిమాకు దర్శకత్వం వహించడం ద్వారా దర్శకురాలిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం లాంటి సినిమాలు డైరెక్ట్ చేసి దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్నారు. కామ్నజెఠ్మలానీ, శాన్వి, సుహాసిని వంటి హీరోయిన్స్‌ని పరిశ్రమకు పరిచయం చేసిన ఆమె ప్రస్తుతం ఓ సినీ వార పత్రికకు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. దర్శకురాలు, పాత్రికేయురాలిగానే కాకుండా తాను దర్శకత్వం వహించిన సినిమాలకు తానే ఎడిటింగ్ చేసుకోవడం జయ ప్రత్యేకత. పంజాగుట్ట శ్మశాన వాటికలో జయ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.


ప్రముఖ సినీ జర్నలిస్ట్, పీఆర్‌వో అయిన బీఏ రాజును వివాహం చేసుకున్న బి జయ ప్రస్తుతం పంజాగుట్ట సమీపంలోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. జయ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరున్న జయ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని పలువురు సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తంచేశారు.