"దంగల్" సినిమాలో చిన్నారి గీతా పోగట్ పాత్రను పోషించిన జైరా వాసిమ్ గుర్తున్నారా..? ఆ చిత్రంలో ఎంతో ఆత్మస్థైర్యం కలిగిన అమ్మాయిగా నటించిన జైరా నిజ జీవితంలో మాత్రం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొందట. డిప్రెషన్ అనేది తనకు ఎంత నరకయాతనను చూపించిందో ఆమె ఇటీవలే ఓ సోషల్ మీడియా పోస్టులో బహిర్గతం చేసింది. అయినా డిప్రెషన్‌ను జయించడానికి తాను ఎంతగానో ప్రయత్నించిందని ఆమె తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"డిప్రెషన్ తొలిదశలో నేను చాలా ఉద్రేకానికి గురయ్యేదానిని. రోజూ నిద్రమాత్రలు వేసుకొని పడుకొనేదాన్ని. ఏదో తెలియని ఆందోళన. అలాగే అర్థరాత్రి లేచి ఆసుపత్రికి వెళ్లి టెన్షన్ తగ్గించుకొనేదాన్ని. జీవితంలో ఏదో కోల్పోయినట్లు ఉండేది. విపరీతమైన తలనొప్పి వచ్చేది.



అప్పుడప్పుడు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించేదాన్ని. డాక్టర్ దగ్గరకు వెళ్తే ఈ వయసులో డిప్రెషన్ ఏమిటి అనేవారు. చాలా మంది అభిప్రాయంలో 25 సంవత్సరాలు దాటినవారు మాత్రమే డిప్రెషన్‌కు గురవుతారట. అందుకే నా బాధ ఎవరితోనైనా చెప్పుకోవాలనుకున్నా కుదిరేది కాదు" అని తన మనోభావాలను బహిర్గతం చేసింది జైరా వాసిమ్.


ప్రస్తుతం ఈ డిప్రెషన్ నుండి బయటకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని.. అందుకే రంజాన్ సందర్భంగా జీవితంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నానని తెలిపింది ఆమె. అందులో మొదటిది ఆమె సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని భావిస్తుందట.



అలాగే కొన్నాళ్లు స్కూలుకి, సినిమాలకు కూడా దూరంగా ఉంటుందట. దయచేసి మీ ప్రార్థనల్లో నన్ను తలుచుకోండి అని ఆమె తన పోస్టులో తెలిపింది. జైరా వాసిమ్ "దంగల్", "సీక్రెట్ సూపర్ స్టార్" సినిమాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.