కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే  "దేశంలో ఆరు లక్షల కన్నా ఎక్కువ వైద్యుల కొరత ఉంది.  కానీ ఈ సమస్య  2022లోపు అధిగమిస్తాము. ఎందుకంటే మెడికల్ కళాశాలల్లో సీట్ల సంఖ్య పెంచుతున్నాము. ఇప్పడున్న దేశ జనాభాకు 14 నుంచి 16 లక్షల మంది వైద్యులు అవసరం ఉంది. కానీ ప్రస్తుతం ఎనిమిది లక్షల మంది డాక్టర్లు మాత్రమే ప్రజలకు సేవలందిస్తున్నారు" అని అన్నారు.  


దేశంలో ప్రతిఒక్కరి ఆరోగ్య సేవలు నెరవేర్చాలనే లక్ష్యంతో మెడికల్ కాలేజీల్లో సీట్ల సంఖ్యను పెంచడానికి ప్రధాన మంత్రి సిద్ధంగా ఉన్నారని చౌబే అన్నారు. సీట్ల సంఖ్య పెరిగితే ప్రతీ ఏడాది 67,972 మంది ఎంబిబిఎస్ వైద్యులు, 30,228 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యులు బయటికి వస్తారని, ప్రస్తుతం ఈ సంఖ్య వరుసగా 32,000 మరియు 12,000 ఉందని వెల్లడించారు.  సీట్ల పెరుగుదలతో 2022 కల్లా వైద్యుల కొరత తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.