Foods To Be Avoided On Dengue Fever: వర్షాకాలం వచ్చిందంటే చాలు కొన్ని రకాల జబ్బులు వద్దన్నా వచ్చిపడతాయి. అందులో డెంగ్యూ ప్రధానమైనది. ఈ వర్షా కాలం కూడా అందుకు మినహాయింపేం కాదు.. ఇప్పటికే దేశం నలుమూలలా అన్ని రాష్ట్రాల్లోనూ డెంగ్యూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డెంగ్యూ జ్వరం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే డెంగ్యూ బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు. ఒకవేళ టైమ్ బాగోలేక డెంగ్యూ బారిన పడినప్పటికీ.. డెంగ్యూ జ్వరం గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిసి ఉంటే.. సమస్య మరింత జఠిలం కాకుండా బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అందుకే ఈ విషయాలపై ఓ లుక్కేద్దాం రండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవద్దంటే.. 
డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు జీర్ణ శక్తి తగ్గిపోతుంది. అందుకే చీజ్, బటర్ వంటి ఆహార పదార్థాలతో పాటు అవోకాడో వంటి పండ్లు తినకూడదు. డెంగ్యూ జ్వరంతో బాధపడే వారికి ఇవి జీర్ణం చేసుకునేంత శక్తి ఉండదు. 


వంట చేసిన తరువాత వేడి వేడి ఆహారం తినడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. వంట చేసి చాలాసేపు బయట పెట్టడమో లేదా పక్కకు పెట్టిన ఆహారాన్ని తినకూడదు.  


ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా డెంగ్యూ జ్వరంతో ఉన్నప్పుడు జీర్ణ శక్తి తగ్గిపోతుంది కనుక స్పైసీ ఫుడ్ లేదా మసాలాలు దట్టించి తయారు చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అవి తింటే ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంటుంది.


డెంగ్యూ జ్వరంతో ఉన్నప్పుడు కాఫీ తాగకూడదు. ఎందుకంటే కాఫీలో కెఫైన్ అధికంగా ఉంటుంది. అది డీహైడ్రేషన్ లేదా కండరాల క్షీణతకు దారితీస్తుంది. 


పంఛదార ఎక్కువగా ఉపయోగించి చేసే పానియాలు అస్సలే తీసుకోవద్దు. ఎనర్జి డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ లేదా కూల్ డ్రింక్స్ వంటి వాటిలో తీపి కోసం షుగర్ ఎక్కువగా ఉపయోగిస్తారు. 


ఆయిల్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. డెంగ్యూ జ్వరం సోకిన వారికి జీర్ణ శక్తి తగ్గడంతో పాటు పేగులు సైతం బలహీనంగా మారుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయిల్ ఫుడ్స్ తింటే అవి మరింత అనారోగ్యానికి దారితీస్తుంది. ఆయిల్, కెమికల్స్, ఫుడ్ నిల్వ ఉండేలా ప్రిజర్వేటివ్స్ ఉపయోగించి చేసే ప్రాసెస్డ్ ఫుడ్స్‌కి నో చెప్పాలి. ఇలాంటి విషయాలు తెలుసుకుని జాగ్రత్తపడితే డెంగ్యూ జ్వరం తీవ్రం కాకుండా చూసుకోవచ్చు. అదే సమయంలో వీలైనంత త్వరగా డెంగ్యూ జ్వరం నుండి కోలుకుని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే ప్లేట్లెట్స్ పడిపోయి జ్వరం ఎక్కువై సమస్య మరింత అధికం అవుతుంది.