Rainbow Childrens Hospital: తీవ్రమైన న్యుమోనియా, ఎఆర్‌డీఎస్‌తో బాధపడుతూ.. ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్‌పై ఉన్న గోవాకు చెందిన 18 నెలల పసికందును రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్య బృందం కాపాడింది. ఈ చిన్నారిని రక్షించడానికి హైదరాబాద్‌లోని రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ టీమ్‌వర్క్, సమన్వయంతో పనిచేసింది. మన దేశంలో ఒక చిన్నారిని కాపాడటానికి ఈ తరహా వైద్య జోక్యం జరగడం ఇదే తొలిసారి. గోవాలో ఇన్‌ఫ్లుఎంజా న్యుమోనియాలో తర్వాత స్థాయి ARDS (అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్) ఆ చిన్నారికి ఉంది. అప్పటికే ఒక వారం పాటు కృత్రిమంగా ఊపిరి అందిస్తున్నారు. హై-ఫ్రీక్వెన్సీ వెంటిలేషన్, 100 శాతం ఆక్సిజన్, HFOVలో సపోర్ట్‌తో ఉన్నాడు. అయినా పూర్తిస్థాయిలో ఆక్సిజన్ అందకపోవడంతో ఆ చిన్నారికి ECMO సహాయం అవసరమైంది. ఆ తరహా రోగులకు చికిత్సను అందించేందుకు అవసరమైన హాస్పిటల్‌కు వెంటనే తరలించాల్సిన అవసరం ఏర్పడింది.
 
ECMO అంటే ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెమ్బ్రేన్ ఆక్సిజనేషన్. ఈ ప్రక్రియలో రక్తం శరీరం వెలుపల నుంచి గుండె-ఊపిరితిత్తులకు యంత్రానికి సాయంతో పంప్ చేస్తారు. ఇది కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించి ఆక్సిజన్‌తో నిండిన రక్తాన్ని శరీరంలోని కణజాలాలకు తిరిగి పంపుతుంది. ఇది ఊపిరితిత్తులకు విశ్రాంతి కల్పించటంతో పాటుగా తిరిగి కోలుకోవటానికి, ఆక్సిజన్‌ను నిర్వహించడానికి సహాయపడుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ చిర్ల మాట్లాడుతూ.. “ప్రముఖ పీడియాట్రిక్ ECMO సెంటర్‌గా వెలుగొందుతున్న రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు ఈ చిన్నారి తరలింపు కోసం కాల్ వచ్చింది. కాల్ వచ్చిన వెంటనే.. పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, పీడియాట్రిక్ కార్డియోథొరాసిక్ సర్జన్, ECMO శిక్షణ పొందిన పెర్ఫ్యూషనిస్ట్, ECMO శిక్షణ పొందిన ఇంటెన్సివ్ కేర్ నర్సు, బయోమెడికల్ బృందం ICATT బృందంతో కలిసి గోవా ఆసుపత్రిలో ECMOను సురక్షితంగా నిర్వహించేందుకు, చిన్నారిని ఇక్కడికి సురక్షితంగా తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.." అని తెలిపారు.


యూకేలో ECMOపై శిక్షణ పొందిన సీనియర్ కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ కపిల్ బి సచానే ఈ ఎయిర్ అంబులెన్స్ బృందానికి నేతృత్వం వహించారు. ఈ బృందంలో కీలక సభ్యుడైన పీడియాట్రిక్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ సాయి రామ్‌తో కలిసి ఆయన మాట్లాడుతూ.. “రెయిన్‌బో రిట్రీవల్ టీమ్ 24 గంటలకు పైగా అవిశ్రాంతంగా పని చేయడం ద్వారా ఈ పనిని విజయవంతంగా పూర్తి చేయగలిగింది. ECMO సపోర్ట్ అందించాలని నిర్ణయం తీసుకున్న నాలుగు గంటల్లోపే.. మా బృందం గోవా చేరుకుంది. శిశువుకి 6 గంటల్లోపే ECMO సపోర్ట్‌ను వేగంగా అందించాం. 


ఈ చిన్నారి తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడు. దీనికి తోడు కొత్త ఆసుపత్రిలో ECMOని ప్రారంభించడం కూడా సవాలుగా మారింది. అలాగే దేశంలో ఇలాంటి రవాణా నిర్వహించడం ఇదే తొలిసారి. ఇక్కడ ఆసుపత్రిలో ECMO ప్రారంభించిన తర్వాత.. సగం పని పూర్తయింది. ఈ చిన్నారి ఆక్సిజన్ సాచురేషన్ మెరుగుపడింది. తల్లిదండ్రులు కొంచెం ఉపశమనం పొందారు. మాకు ఒక అద్భుతమైన సర్జన్ ఉన్నారు. ఆయన నైపుణ్యం, కృషి ఈ చిన్నారిని కాపాడటంలో ఎంతగానో తోడ్పడింది. ఈ చిన్నారిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించటానికి ముందు.. రవాణా సమయంలో చిన్నారి సురక్షితంగా ఉందని నిర్ధారించడానికి మా బృందం అవిశ్రాంతంగా పనిచేసింది.." అని వెల్లడించారు.


పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ హెచ్‌ఓడీ డాక్టర్ ఫర్హాన్ షేక్ మాట్లాడుతూ.. “ఈ చిన్నారి తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. 29 రోజులు (సుమారు 4 వారాలు) ECMO పై ఉన్నాడు. వివిధ విభాగాల మధ్య కచ్చితమైన ప్రణాళిక, సమన్వయం కారణంగా మేము ఈ తరలింపును విజయవంతంగా చేయగలిగాము. యూనిట్‌లో ఎక్కువ కాలం ఉన్న ఈ బిడ్డ సంరక్షణ సవాలుగా నిలిచింది. ఈ చిన్నారి హాస్పిటల్‌లో ఉన్న సమయంలో ఆరోగ్య పరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. అతని తల్లిదండ్రులు తమ పూర్తి మద్దతు అందించారు . టీమ్‌వర్క్, 24 గంటల ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ మద్దతు, అద్భుతమైన ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ పద్ధతులతో మేము ఈ చిన్నారిని రక్షించగలిగాము.." అని తెలిపారు.


ఎయిర్ లిఫ్ట్ చేసిన ఈ చిన్నారి ఇప్పుడు చెప్పుకోదగ్గ పురోగతిని సాధించాడు. ECMO నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు అతి తక్కువ ఆక్సిజన్‌ మద్దతులో ఉన్నాడు. ఆ చిన్నారిని త్వరలోనే గోవాకు తీసుకెళ్లేందుకు అతని తల్లిదండ్రులు ప్లాన్ చేసుకుంటున్నారు. పిల్లల జీవితాలను రక్షించడంలో తమ నిబద్ధతను ప్రదర్శిస్తూ, మారుమూల ప్రాంతాల నుండి కూడా అనారోగ్యంతో ఉన్న రోగులకు వైద్యం అందించడానికి రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ తీవ్రంగా శ్రమిస్తోంది.