50 కోట్ల మంది మొబైల్ నెంబర్లు పనిచేయకపోవచ్చు..!
50 కోట్ల మంది మొబైల్ నెంబర్లు పనిచేయకపోవచ్చు..!
దేశవ్యాప్తంగా 50 కోట్ల మంది మొబైల్ నెంబర్లు పనిచేయకపోవచ్చు. ఆధార్ కార్డు తప్ప మరే ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇవ్వకుండా మొబైల్ కనెక్షన్ తీసుకున్న వినియోగదారులకు ఈ ప్రమాదం పొంచి ఉంది. అయితే ఆధార్ కార్డు ఇచ్చి మొబైల్ కనెక్షన్లను తీసుకున్న వినియోగదారుడు కొత్త KYC ప్రక్రియకు వెళ్లవలసి ఉంటుందని కొందరు అంటున్నారు. ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ ద్వారా తీసుకున్న సిమ్ కార్డుకి ఏదైనా ఇతర ఐడెంటిఫికేషన్ ప్రక్రియ యొక్క బ్యాకప్ లేకపోతే ఈ సిమ్ డిస్కనెక్ట్ అవుతుంది.
ఇటీవలే సుప్రీం కోర్టు ఆధార్‌పై తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. రాష్ట్రాలు సహా ప్రైవేట్ కంపెనీలు ఆధార్ డేటాను కోరడానికి వీల్లేదని కోర్టు చెప్పేసింది. మొబైల్ నంబర్‌లు తీసుకునేందుకు టెలికాం కంపెనీలు ఆధార్ కోసం బలవంతం చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత కేంద్రం, టెలికాం కంపెనీలు కొత్త కేవైసీ ప్రక్రియ ద్వారా మొబైల్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించుకుంది.
టెలికాం ఆఫ్ ఇండియా కథనం మేరకు.. బుధవారం నాడు టెలికాం కార్యదర్శి అరుణ్ సుందరరాజన్ ఈ విషయంలో సర్వీసు ప్రొవైడర్ కంపెనీలను కలుసుకున్నారు. ఐడెంటిఫికేషన్ ప్రక్రియ కోసం ఇతర మార్గాలపై చర్చించారు. ఈ విషయంపై యుఐడిఎఐతో టెలికాం విభాగం కూడా పరస్పరం మాట్లాడుతోంది.
ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని అరుణ్ సుందరరాజన్ అన్నారు. ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయని, కొత్త కేవైసీ ప్రక్రియ వల్ల ప్రజలు ఆందోళన చెందకూడదని ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కల్గకుండా సింపుల్‌గా చేయాలని భావిస్తున్నట్లు సుందరరాజన్ అన్నారు.
ఒక ప్రత్యేకమైన అప్లికేషన్ ఫామ్ ను రూపొందించి, దాని ద్వారానే వినియోగదారుడి యొక్క ఫోటోను క్యాప్చర్ చేసి, సెల్ఫ్ అటెస్ట్ చేయబడిన ఐడెంటిటి, అడ్రస్ ప్రూఫ్ లను ఒక ఫారంలో ఎంబెడ్ చేసి వెలిడేషన్ కి పంపాలన్న పాత తరహా ప్రతిపాదనలను టెలికాం కంపెనీలు ప్రతిపాదిస్తున్నాయి.
ఒక్క ఆధార్ కార్డును మాత్రమే ఆధారంగా చేసుకొని రిలయన్స్ జియో చాలా మొబైల్ కనెక్షన్లను ఇచ్చిందని మీకు తెలుసుగా. JIO యొక్క డేటాబేస్, నెట్వర్క్ ఆపరేషన్ మొత్తం బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి, జియోకి 25 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారని కంపెనీ బుధవారం ప్రకటించింది. జియోతో పాటు భారతి ఎయిర్టెల్, వొడాఫోన్, బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్ నెట్‌వర్క్ యూజర్లపై కూడా ఈ ప్రభావం పడనుంది.
ఏదేమైనా ఇప్పటికే వినియోగిస్తున్న కొత్త సిమ్‌లు, కొత్తగా జారీ చేయబడిన సిమ్‌ల విషయంలో కొద్దికాలం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. టెలికాం కంపెనీలన్నీ మీ ఐడెంటిటీ ప్రూఫ్‌లను మళ్లీ సబ్మిట్ చేయమని అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.