అయోధ్యలో 100 మీటర్ల ఎత్తైన శ్రీరాముడి విగ్రహం నిర్మాణం ?
అయోధ్యలో 100 మీటర్ల ఎత్తైన శ్రీరాముడి విగ్రహం నిర్మాణం ?
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ దీపావళికి భారీ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. రామజన్మ భూమి అయోధ్యలో 100 మీటర్ల ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని నిర్మించతలపెట్టాలని భావిస్తున్న యోగి ఆదిత్యనాధ్.. దీపావళి రోజున ఈ అంశంపై ఓ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. టైమ్స్ నౌ న్యూస్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం.. అయోధ్యలోని సరయు నది ఒడ్డున ఈ భారీ విగ్రహాన్ని నిర్మించనున్నట్టు సమాచారం.
శుక్రవారం నాడు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మహేంద్రనాధ్ పాండే మీడియాతో మాట్లాడుతూ.. "దీపావళి రోజున యోగి ఆదిత్యనాధ్ ఓ బ్రహ్మాండమైన ప్రకటన చేస్తారని, ఆ ప్రకటన ఏంటో ఆయన నోట వింటేనే బాగుంటుంది" అని అన్నారు. పాండే చెప్పిన తీరు చూస్తే, యోగి ఆదిత్యనాథ్ చేయబోయే ప్రకటన శ్రీరాముడి విగ్రహం నిర్మాణం గురించేనేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యోగి చేయబోయే ప్రకటన గురించి మహేంద్రనాథ్ పాండే పరోక్షంగా లీకులు ఇచ్చాడా అనే సందేహాలు వినిపిస్తున్నాయి.