బీహార్: ఒక మైనర్ బాలిక(13)పై ఎనిమిది మంది మృగాళ్లు దాడి చేసి అత్యాచారానికి ప్రయత్నించిన సంఘటన బీహార్‌లోని జెహనాబాద్‌లో చోటుచేసుకుంది. పట్టపగలు నడి రోడ్డుపై జరిగిన ఈ దుశ్చర్యలో బాధితురాలిని రక్షించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. ఒక వ్యక్తి మాత్రం జరిగిన సంఘటనను తన సెల్‌ఫోన్లో వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోనికి వచ్చింది. పోలీసులు దీనిపై స్పందించి దర్యాప్తు ప్రారంభించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసుల వివరాల ప్రకారం, బాధితురాలిపై ఏడుగురు యువకులు, ఒక వ్యక్తి దాడి చేసి అత్యాచారానికి ప్రయత్నించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిలో ఆరుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వీడియోలో నిందితులకు సంబంధించి మోటార్ బైక్ కనిపించడంతో ఈ కేసులో అదే పోలీసులకు క్లూగా మారింది. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు.


సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి నయ్యర్‌ హస్నైన్‌ ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే వీడియోను చిత్రీకరించిన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులపై పోస్కోట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు.