రాజాజీ హాలు వద్ద తోపులాట.. ఇద్దరు మృతి
చెన్నైలోని రాజాజీ హాల్ దగ్గర తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు అభిమానులు, మద్దతుదారులు భారీ సంఖ్యలో తరలి వస్తున్న క్రమంలో అక్కడ తోపులాట చోటుచేసుకుంది.
చెన్నైలోని రాజాజీ హాల్ దగ్గర తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు అభిమానులు, మద్దతుదారులు భారీ సంఖ్యలో తరలి వస్తున్న క్రమంలో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. భారీ జన సందోహాన్ని నిలువరించేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఉదయం నుంచి అభిమానులు కరుణానిధి కడసారి చూపు కోసం వేచి ఉన్నా.. ప్రముఖుల రాకతో చూసేందుకు అవకాశం రాలేదు. దీంతో కరుణను దగ్గరగా చూడాలని కొందరు అభిమానులు చొచ్చుకుని వెళ్లేందుకు బారికేడ్లు దాటుకుని వెళ్లగా .. అక్కడ తోపులాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో 33 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు వ్యక్తులు మరణించారు.
రాజాజీ హాల్ చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కరుణ పార్థివదేహం ఉన్న ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా భారీ భద్రత కట్టుదిట్టం చేశారు.