గణతంత్ర దినోత్సవం: దేశ రాజధానిలో దాడులకు వ్యూహరచన, ఇద్దరు తీవ్రవాదులు అరెస్ట్
గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించేందుకు వ్యూహం రచిస్తున్న ఇద్దరు తీవ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించేందుకు వ్యూహం రచిస్తున్న ఇద్దరు తీవ్రవాదులను అరెస్ట్ చేసినట్టు ఢిల్లీ పోలీసులు గురువారం తెలిపారు. అరెస్ట్ అయిన తీవ్రవాదులలో ఒకరిని జైషే మహమ్మద్‌కి చెందిన అబ్ధుల్ లతీఫ్ ఘని(29) అలియాస్ ఉమర్ అలియాస్ దిలావర్‌గా మరొకరిని హిలాల్ అహ్మద్ భట్ (26)గా గుర్తించారు. ఈ ఇద్దరిని జమ్మూకాశ్మీర్‌లోని వకురా, బందిపోరా ప్రాంతాల వాసులుగా ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు.
మిలిటరీ ఇంటెలీజెన్స్ వర్గాలు ఇచ్చిన విశ్వసనీయమైన సమాచారం మేరకు జనవరి 20-21 అర్ధరాత్రి దిలావర్‌ని అరెస్ట్ చేసినట్టు ప్రత్యేక విభాగం డీసీపీ కుశ్వాహ చెప్పారు. రాజ్‌ఘాట్ వద్ద మరొకరిని కలవడానికి దిలావర్ వస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు ఒక పథకం ప్రకారం అతడిని వలేసి పట్టుకున్నారు. దిలావర్ నుంచి ఏ32 బోర్ పిస్టల్, 26 లైవ్ క్యాట్రిడ్జెస్, జైషే మహమ్మద్ కమాండర్స్ పేరిట వున్న మూడు రబ్బర్ స్టాంప్స్‌ని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో దాడులకు ఇప్పటికే రెక్కీ నిర్వహించిన అహ్మద్ భట్‌ను బందిపోరాలో అరెస్ట్ చేసినట్టు పోలీసులు మీడియాకు వెల్లడించారు.