2014 డానిష్ మహిళ రేప్ కేసు: తీర్పు మార్చేది లేదన్న హైకోర్టు
ఢిల్లీ హైకోర్టు సోమవారం ట్రయల్ కోర్టు ఆర్డరును మార్చేది లేదని... నేరస్థులు శిక్ష అనుభవించాల్సిందేనని తెలిపింది.
ఢిల్లీ హైకోర్టు సోమవారం ట్రయల్ కోర్టు ఆర్డరును మార్చేది లేదని... నేరస్థులు శిక్ష అనుభవించాల్సిందేనని తెలిపింది. 2014 సంవత్సరంలో దేశ రాజధానిలో 52 సంవత్సరాల డానిష్ మహిళను అయిదుగురు రేప్ చేసిన కేసులో నిందితులకు జీవితఖైదు పడింది. అయితే ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ వారు హైకోర్టులో అపీల్ చేసుకున్నారు. ఈ రోజు ఆ అపీలుకు సంబంధించిన విచారణను విన్న ఢిల్లీ హైకోర్టు శిక్షలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది.
ఎస్ మురళీధర్, ఐఎస్ మెహతాలతో కూడిన ధర్మాసనం అపీళ్లను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. 2016 జూన్‌లో ఈ కేసుకి సంబంధించి తొలి తీర్పు వెలువడింది. డీఎన్‌ఏ రిపోర్టుతో పాటు బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా ఈ తీర్పును కోర్టు వెలువరించింది. అమానవీయమైన చర్యగా ఈ ఘటనను పేర్కొంది.
ఈ కేసులో నిందితులపై ఐపీసీ సెక్షన్ డి (గ్యాంగ్ రేప్)తో పాటు 395 (డెకాయిట్), 366 (కిడ్నాపింగ్) మొదలైన సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. జనవరి 14, 2014 తేదిన ఢిల్లీలోని డివిజనల్ రైల్వే ఆఫీసర్స్ క్లబ్బు దగ్గర తొమ్మిదిమంది యువకులు, దారి మరిచిపోయిన విదేశీ యాత్రికురాలిని కిడ్నాప్ చేసి, ఆమె డబ్బు, వస్తువులను దోచుకోవడమే కాకుండా.. గ్యాంగ్ రేప్ చేశారు. అందులో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారు.