దళితుడి ఇంటిలో ఆతిథ్యం స్వీకరించిన మంత్రి.. వివాదంలో ఎందుకు చిక్కుకున్నారు..?
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ అధినేత సురేష్ రానా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన `దళితవాడల సందర్శన` పథకంలో భాగంగా ఓ ఇంటికి వెళ్తానని.. ఆ ఇంట్లోనే భోజనం చేస్తానని తెలిపారు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత సురేష్ రానా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన "దళితవాడల సందర్శన" పథకంలో భాగంగా ఓ ఇంటికి వెళ్తానని.. ఆ ఇంట్లోనే భోజనం చేస్తానని తెలిపారు. అలా ఆయన చెప్పిన విధంగానే రజనీష్ కుమార్ అనే ఓ దళిత పౌరుడి ఇంటికి వెళ్లారు. అయితే ఆయన ఆ ఇంటి భోజనం చేయలేదు సరికదా.. ఆ ఇంటికి సంబంధించి పచ్చి మంచి నీళ్లు కూడా తాగలేదని పలువురు అంటున్నారు.
ఒక ప్లాన్ ప్రకారం ఆయన ఆ ఇంటికి చేరే ముందే స్థానిక హోటల్ నుండి ఫుడ్ ఆర్డరిచ్చారని.. ఆ ఇంట్లోకి వెళ్లాక అదే భోజనం చేశారని..ఆయనతో పాటు వెళ్లిన పలువురు కార్యకర్తలే చెప్పడం గమనార్హం. రజనీష్ ఇంటిని సందర్శించక ముందే మంత్రి రాకను పురస్కరించుకొని ఓ ప్రముఖ హోటల్ నుండి పాలక్ పన్నీర్, పులావ్, గులాబ్ జామున్, రాజ్మా, దాల్ తడ్కా, తందూరి రోటీ, సలాడ్, రైతా, మినరల్ వాటర్ ఆర్డరిచ్చారని తెలుస్తోంది.
ముందస్తు పథకం ప్రకారమే ఇవ్వన్నీ ఆర్డర్ ఇచ్చి.. ఆ తర్వాత మంత్రి దళిత సోదరుల ఇంటికి వెళ్లి భోజనం చేస్తే ఏమిటి? చేయకపోతే ఏంటి అని పలువురు పెదవి విరవగా.. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారంగా మంత్రి కొట్టిపారేశారు. తను వస్తున్నట్లు సదరు దళిత కుటుంబానికి ముందుగానే తెలుసు కాబట్టి.. ఈ విషయాన్ని వివాదం చేయవద్దని ఆయన తెలిపారు.
అలీగఢ్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే సురేష్ రానా చేసిన పనిపై పలు దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇష్టం లేకపోతే దళితుల ఇళ్ళకు రావడం మానేయాలని.. అంతేగానీ ఆయన ఇలా ప్రవర్తించడం అంటే దళితులను అవమానించడమేనని పలు సంఘాలు ఆరోపించాయి