అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత రక్షణ దళాలు ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించాయి. యోగా ఆవశ్యకతను తెలిపే పలు వినూత్నమైన సాహసోపేత కార్యక్రమాలు నిర్వహించాయి. ముఖ్యంగా ఎత్తైన శిఖరాలతో పాటు ఎడారి, నదీ తీరాల్లో యోగా చేస్తూ ఆ ఛాయాచిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నాయి.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కార్యక్రమాల్లో ఇండో టిబెటిన్ దళాలు అతి శీతల ప్రాంతమైన లడఖ్‌లోని ఎడారిలో 18000 అడుగుల ఎత్తులో భీకరమైన చలి వాతావరణంలో చేసిన సూర్య నమస్కారాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని లోహిత్ పురలోని డిగరు నదీ ప్రాంతంలో ఐటీబీపీ జవాన్లు "రివర్ యోగా" చేసి అందరినీ ఆకట్టుకున్నారు.



అదే విధంగా విశాఖపట్నంలోని తూర్పు నావికా దళం ఉద్యోగులు ఐఎన్‌ఎస్ జ్యోతి బోర్డుతో పాటు సబ్ మెరైన్‌లో యోగా చేసి తమ ఘనతను చాటుకున్నారు. నిన్నే భారత ప్రధాని నరేంద్ర మోదీ డెహ్రాడున్ ప్రాంతంలోని అటవీ పరిశోధన కేంద్రంలో దాదాపు 50,000 యోగా ఔత్సాహికులతో కలసి తాను కూడా యోగా చేశారు.



ఈ సందర్భంగా ఆయన యోగా ఆవశ్యకతను తెలిపారు. ప్రపంచంలో రోజు రోజుకీ ప్రాధాన్యతను సంతరించుకుంటున్న సంప్రదాయ ఆరోగ్య విధానాల్లో యోగా కూడా ఒకటని ఆయన తెలిపారు.