ట్రక్కును ఢీకొన్న ట్రావెల్స్ బస్.. ఐదుగురు మృతి, 50 మందికి గాయాలు
ట్రక్కును ఢీకొన్న ట్రావెల్స్ బస్.. ఐదుగురు మృతి, 50 మందికి గాయాలు
ఆగ్రా: ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వేపై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఆగి వున్న ఓ ట్రక్కును ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌కి చెందిన డబుల్ డెక్కర్ బస్ వేగంగా వచ్చి ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరో 50 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రయాణికులతో బీహార్ నుంచి జైపూర్ వెళ్తున్న బస్ హర్యానాలోని ఫతెహాబాద్ మలుపు వద్ద మలుపుతిప్పే క్రమంలో ఈ ఘోర ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. బస్సు వేగంగా రావడం ఈ దుర్ఘటనకు ఓ కారణమైతే, ఇసుక లోడ్‌తో నింపి వున్న ట్రక్కు రోడ్డుపక్కనే పార్క్ చేసి వుండటం మరో కారణమైంది.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అధికార యంత్రాంగం హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. తరచుగా ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వేపై జరుగుతున్న ప్రమాదాల్లో భారీ సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోతుండటం ఆ రహదారిపై ప్రయాణించే వారిని ఆందోళనకు గురిచేస్తోంది.