బస్సు నదిలో పడి ఆరుగురు మృతి, 18 మందికి గాయాలు
బస్సు నదిలో పడి ఆరుగురు మృతి, 18 మందికి గాయాలు
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని రైజెన్ జిల్లా ఛతర్‌పూర్ నుంచి ఇండోర్ వెళ్తున్న ప్రయాణికుల బస్సు ప్రమాదవశాత్తూ నదిలో పడిన ఘటనలో ఆరుగురు మృతిచెందగా మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో రెండేళ్ల బాలుడితోపాటు ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రైజెన్ ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. క్షతగాత్రుల్లో ఏడుగురిని రైజెన్ జిల్లా ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్న మరో 11 మందిని భోపాల్‌లోని ఆసుపత్రికి తరలించారు. బుధవారం అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదానికి మితిమీరిన వేగమే కారణమని తెలుస్తోంది.
ప్రమాద ఘటన గురించి తెలియగానే జిల్లా కలెక్టర్‌తోపాటు అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. దుర్ఘటనపై రైజెన్ జిల్లా కలెక్టర్ ఉమాశంకర్ భార్గవ్ మాట్లాడుతూ.. బస్సు నదిలో పడినపుడు అందులో 45 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి పదివేల రూపాయలను రెడ్ క్రాస్ ద్వారా అందించామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి నివేదిక అందించాల్సిందిగా పోలీసులను ఆదేశించినట్టు కలెక్టర్ వెల్లడించారు.