లోక్ సభ ఎన్నికలు 6వ విడత పోలింగ్‌కి సర్వం సిద్ధం
లోక్ సభ ఎన్నికలు 6వ విడత పోలింగ్‌కి సర్వం సిద్ధం
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా రేపటి ఆదివారం జరగనున్న 6వ విడత పోలింగ్‌కి సర్వం సిద్దమైంది. ఏడు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 59 లోక్ సభ స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. ఉత్తర్ ప్రదేశ్‌లో 14 స్థానాలు, హర్యానాలో 10 స్థానాలు, బీహార్‌లో 9 స్థానాలు, మధ్యప్రదేశ్‌లో 8 స్థానాలు, పశ్చిమ బెంగాల్‌లో 8, ఢిల్లీలో 7, జార్ఖండ్‌లో 4 లోక్ సభ స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలోని అన్ని ఏడు లోక్ సభ స్థానాలకు రేపే పోలింగ్ జరగనుంది. రాధామోహన్ సింగ్, మేనకా గాంధీ, హర్షవర్థన్ వంటి కేంద్ర మంత్రులు ఈ ఎన్నికల బరిలో నిలిచారు. వీళ్లే కాకుండా మనోజ్ తివారి, మీనాక్షి లేఖి, గౌతం గంభీర్, ప్రముఖ పంజాబీ ఫోక్ సింగర్ హన్స్ రాజ్ హన్స్ వంటి వారు కూడా ఈ విడత ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రముఖుల జాబితాలో వున్నారు.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కాంగ్రెస్ పార్టీ నుంచి నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి బరిలో నిలిచారు. జ్యోతిరాదిత్య సింథియా (గుణ లోక్ సభ స్థానం), మాజీ బాక్సర్ విజేందర్ సింగ్ వంటి వారు సైతం కాంగ్రెస్ తరపున పోటీచేస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పోటీచేస్తున్న అజంఘడ్ లోక్ సభ స్థానం సైతం ఇదే విడతలో పోలింగ్ జరగనుంది. 2014 ఎన్నికల్లో ములాయం సింగ్ యాదవ్ గెలిచిన స్థానం నుంచే ఈసారి అఖిలేష్ యాదవ్ పోటీచేస్తున్నారు.