7th Pay Commission: రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మార్చిలోనే పెరిగిన జీతం
7th Pay Commission Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎదురుచూపులు ఫలించనున్నాయి. ప్రభుత్వం తీపికబురు అందించనుంది. ఈసారి కూడా ఉద్యోగులకు నాలుగు శాతం డీఏ పెంచే అవకాశం ఉంది.
7th Pay Commission Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న డీఏ పెంపు ప్రకటనకు సమయం ఆసన్నమైంది. మరో రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం హోలీ కానుకగా ఇవ్వబోతోంది. అధికారిక సమాచారం ప్రకారం.. ఈసారి కూడా ప్రభుత్వం డీఏ 4 శాతం పెంచుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది జూలైలో కూడా నాలుగు శాతం డీఏను పెంచిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఉద్యోగులకు 38 శాతం చొప్పున డీఏను అందజేస్తున్నారు. ఇది నాలుగు శాతం పెంచితే 42 శాతానికి చేరుకుంటుంది. పెరిగిన జనవరి 2023 నుంచి అందుబాటులోకి వస్తుంది. కేంద్రం నుంచి ప్రకటన వస్తే.. ఈ నెల జీతంలో ఒకేసారి భారీ మొత్తంలో నగదు జమ కానుంది. ఏ ఉద్యోగి అయినా నెలకు రూ.30 వేల బేసిక్ జీతం ఉంటే.. అతని జీతం ప్రతి నెలా రూ.1200 పెరుగుతుంది. దీని ప్రకారం వార్షిక వేతనంలో రూ.14,400 పెరుగుదల ఉంటుంది. ఒక ఉద్యోగి మూల వేతనం నెలకు రూ.2.50 లక్షలు అయితే.. అతని వార్షిక వేతనం రూ.1,20,000 పెరుగుతుంది.
ఏడాదికి రెండు డీఏ పెరుగుతుంది. ఒక పెంపు జనవరి, మరో జూలైలో ఉంటుంది. జనవరి-మార్చి మధ్యలో మొదటి పెంపునకు సంబంధించిన ప్రకటన వస్తుంది. డీఏ పెంపుపై ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జనవరి నెల నుంచే లెక్కవేసి ఇస్తారు. రెండో పెంపు కూడా ఎప్పుడు జరిగినా.. జూలై నెల జీతం లెక్క వేసి ఉద్యోగుల ఖాతాలో జమ చేస్తారు.
అదేవిధంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచాలని కూడా ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌లోనూ కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతంగా ఉండగా.. దీనిని 3.68 శాతానికి పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్‌ను నెరవేరిస్తే బేసిక్ శాలరీ రూ.18 వేల నుంచి రూ.26 వేలకు పెరగనుంది.