చత్తీస్‌ఘడ్‌లోని సుక్మ జిల్లా మరోసారి తుపాకుల మోతతో దద్ధరిల్లింది. సుక్మ జిల్లాలోని సక్లర్ గ్రామం వద్ద సోమవారం జిల్లా రిజర్వ్‌డ్ గార్డ్స్ (డీఆర్‌జీ), సీఆర్పీఎఫ్‌కు చెందిన 206, 208 కోబ్రా బలగాలకు మావోస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతిచెందగా మరో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు కూడా గాయపడినట్టు సుక్మ జిల్లా ఎస్పీ అభిషేక్ మీనా తెలిపారు. ఓవైపు ఎన్‌కౌంటర్ జరుగుతుండగానే మరోవైపు ఘటనాస్థలం నుంచి అమర జవాన్ల మృతదేహాలతోపాటు మావోయిస్టుల మృతదేహాలను తరలించే పనులు మొదలుపెట్టినట్టు అభిషేక్ మీనా పేర్కొన్నారు. 


ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టులు అంతా సీపీఐ(ఎం)కి చెందిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సభ్యులేనని, జిల్లా రిజర్వ్‌డ్ గార్డ్స్, సీఆర్పీఎఫ్‌కు చెందిన 206, 208 కోబ్రా బలగాలు చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో భద్రతా బలగాలు పైచేయి సాధించాయని అభిషేక్ మీనా వెల్లడించారు.