థేని/తమిళనాడు: ఆదివారం తమిళనాడులో పెను అగ్ని ప్రమాదం సంభవించింది. ట్రెక్కింగ్‌కు వెళ్లిన విద్యార్థుల బృందంలో తొమ్మిది మంది కార్చిచ్చుకి బలయ్యారు. 39 మంది విద్యార్థులు రెండు బృందాలుగా తమిళనాడులోని థేని జిల్లా కురంగణి ప్రాంతంలో పర్వతారోహణ కోసం వచ్చారు. ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో వారంతా నిర్ఘాంతపోయారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. ఈ సందర్భంలో మంటల నుంచి కొందరు తప్పించుకోగా.. మరికొందరు అందులో చిక్కుకుపోయారు. అలా చిక్కుకున్న వారిలో తొమ్మిది మంది ట్రెక్కర్లు అగ్నికి ఆహుతయ్యారు. చనిపోయిన వారిలో నలుగురు మహిళలు, నలుగురు పురుషులు, ఒక పిల్లవాడు కూడా ఉన్నారు.  వీరిలో ఆరుగురు చెన్నైకి చెందిన వారుకాగా..  మరో ముగ్గురిని ఈరోడ్ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

థేని ప్రాంతంలో చిక్కుకుపోయిన విద్యార్థులను రక్షించడం కోసం కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వైమానిక దళానికి కబురు పంపి.. వెంటనే సహాయం అందించాల్సిందిగా కోరారు. విద్యార్థులను వెతుకుతూ అడవిలోకి వెళ్లిన వైమానికి దళ అధికారులు  27 మందిని రక్షించారు. వీరిలో పది మందికి చిన్న చిన్న గాయాలయ్యాయి. అలాగే మరో  ఎనిమిది మందికి  తీవ్ర గాయాలయ్యాయి. వీరికి మెరుగైన వైద్యం అందించడం కోసం స్థానిక  ఆసుపత్రికి తరలించారు.


అటవీ ప్రాంతంలో వెలుతురు తక్కువగా ఉండడంతో సహాయ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడినట్టు మదురై సర్కిల్ కన్జర్వేటర్ ఆర్కే జగేనియా చెప్పారు. మంటలు వేగంగా నలువైపులా వ్యాపిస్తుండడంతో అటవీ సిబ్బంది, సమీప గ్రామాల గిరిజన ప్రజలు అక్కడికి చేరుకుని సహాయ చర్యల్లో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు, రెవిన్యూ శాఖ, రెస్క్యూ టీంతో  ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.  


చెన్నైకి చెందిన ఓ ట్రెక్కింగ్ క్లబ్ ఆధ్వర్యంలో 27 మంది టెక్కర్లు.. ఈరోడ్, తిరుపూర్‌కి చెందిన 12 మంది విద్యార్థుల బృందంతో కలిసి పశ్చిమ కనుమల్లోని బోధికి శుక్రవారం చేరుకొని.. శనివారం కేరళవైపు అడవుల్లోకి చేరుకున్నారు. ఆదివారం కురంగణి నుంచి ట్రెక్కింగ్ ప్రారంభించారు. ఆదివారం సాయంత్రానికి వారు తిరిగి బోధి చేరుకుని చెన్నైకి తిరుగు ప్రయాణం కావాల్సి ఉండగా అంతలోనే ఈ ఘోర ప్రమాదం జరిగింది.