ట్రాయ్ ఛైర్మన్ అకౌంట్లోకి రూ.1 ట్రాన్స్‌ఫర్ చేసిన హ్యాకర్లు
టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఛైర్మన్ రామ్ సేవక్ శర్మ నిన్న తన ఆధార్ నెంబరును ట్విట్టర్లో పోస్టు చేసి వీలైతే తన వివరాలు తెలపమని ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే.
టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఛైర్మన్ రామ్ సేవక్ శర్మ నిన్న తన ఆధార్ నెంబరును ట్విట్టర్లో పోస్టు చేసి వీలైతే తన వివరాలు తెలపమని ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఛాలెంజ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పలువురు హ్యాకర్లు ఆర్ ఎస్ శర్మ వివరాలను ట్విట్టర్‌లో పోస్టు చేయడం గమనార్హం. ఆర్ ఎస్ శర్మ పాన్ నెంబరుతో పాటు ఆయన ఇటీవలే ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించినప్పుడు తీసుకొన్న ఫ్లైయర్ ఐడి వివరాలను పోస్టు చేసిన హ్యాకర్లు ఆ తర్వాత మరిన్ని వివరాలు పోస్టు చేశారు.
ఆర్ ఎస్ శర్మ పుట్టిన తేదీ వివరాలు, చిరునామా, మొబైల్ నెంబర్లు కూడా హ్యాకర్లు ట్విటర్‌లో పోస్టు చేశారు. అయితే ఈ వివరాలు ఎలా బయటకు వచ్చాయో తమ నిఘా వ్యవస్థ తెలుసుకొని తీరుతుందని ఆ తర్వాత యూఐడిఏఐ ప్రకటించింది. కానీ వారికి మరింత షాక్ ఇస్తూ.. హ్యాకర్లు మరో దుస్సాహసం చేశారు. ఆర్ ఎస్ శర్మ బ్యాంకు ఖాతాకి రూ.1 ట్రాన్స్‌ఫర్ చేశారు. అందుకు గాను భీమ్ యాప్, పేటీఎం యాప్స్ వాడారు.
ఇలియట్ ఆల్డర్ సన్, పుష్పేంద్ర సింగ్, కనిష్క్ సజ్నానీ, అనివర్ అరవింద్, కరణ్ సైనీ పేర్లతో హ్యాకర్లు ట్విట్టర్‌లో ట్రాయ్ ఛైర్మన్ వివరాలు పోస్టు చేయడంతో తొలుత యూఐడిఏఐ అధికారులు కంగుతిన్నారు. కానీ ఆ తర్వాత హ్యాకర్లు పోస్టు చేసిన వివరాలు ఆధార్ ద్వారా ట్రాక్ చేసినవి కావని.. వారు పోస్టు చేసిన వివరాలు గూగుల్ సెర్చింజన్ ద్వారా ఎవరు వెతికినా దొరుకుతాయని సమాధానం తెలిపారు. ఆ తర్వాత యూఐడిఏఐ అధికారులు ఓ ప్రకటన చేశారు. ఆధార్ వ్యవస్థను అపహాస్యం చేయడం కోసం కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని.. ఆ వదంతులేవీ నమ్మవద్దని తెలిపారు.