గుజరాత్ సీఎం అభ్యర్ధి అహ్మద్ పటేల్ ?
గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఆసక్తికర పరిణామాం చోటు చేసుకుంది.
అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. సూరత్ ప్రాంతంలో పలుచోట్ల గుజరాత్‌కు కాబోయే సీఎం అహ్మద్ పటేల్ అంటూ పోస్టర్లు వెలిసాయి. ముస్లిం వర్గమంతా ఏకతాటిపై వచ్చి కాంగ్రెస్‌ను గెలిపించాలని వినతి చేస్తున్నట్లుగా ఆ పోస్టర్లలో ఉండడం గమనార్హం. సోనియా గాంధీకి రాజకీయ సలహాదారుగా ఉన్న అహ్మద్ పటేల్ గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడు. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఆ నేత పేరు బయటికి రావడంతో సాధారణంగా జనాలు ఈ విషయాన్ని నమ్మేశారు.
అహ్మద్ పటేల్ రియాక్షన్...
కానీ సూరత్‌లో వెలిసిన పోస్టర్ అంశంపై అహ్మద్ పటేల్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ''నేను సీఎం రేసులో లేను..భవిష్యత్తులో ఉండబోను" అని తేల్చి చెప్పేశారు. గుజరాత్ ఎన్నికల ప్రచార బాధ్యతలు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఉన్నాయని.. ఎన్నికల అనంతరమే సీఎం అభ్యర్ధిపై నిర్ణయం ఉంటుందని వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేసులో ...
గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గ్రాఫ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి సీఎం అభ్యర్ధిపై పడింది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్ది ఎవరనే విషయం ఇప్పటి వరకు తేలలేదు. ఒక వేళ కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే సీఎం రేసులో ప్రతిపక్ష నేత శంకర్ సిన్హా వాఘేలా, పీసీసీ అధ్యక్షుడు భరత్ సిన్హా సోలంకి, జాతీయ కార్యదర్శి శక్తి సిన్హా, అర్జున్ మోద్వాడియా మరియు సిద్దార్థ్ పటేల్ ఉంటారని బలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.