తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకొస్తున్న అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు చర్చ జరపాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు. అయితే ఈ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకూడదని తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి అభిప్రాయపడ్డారు. "ఏపీ ఈ రోజు తన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని అంటోంది. అందుకోసం వారు అవిశ్వాస తీర్మానం పెట్టుకుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే కావేరీ వివాదం ఏర్పడిన సమయంలో మా ఎంపీలు నిరసన చేపట్టినప్పుడు మాకు మద్దతు ఇవ్వడానికి ఏ పార్టీ కూడా రాలేదు. తెలుగుదేశం కూడా ముందుకు రాలేదు. అలాంటప్పుడు మేము వారికి మద్దతు ఎలా ఇస్తాం" అని ముఖ్యమంత్రి పళనీస్వామి తెలిపారు. ఈ రోజు టీడీపీ నాయకులు కొందరు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను కలసి మాట్లాడేందుకు అనుమతి కోరగా.. అందుకు అనుమతి లభించలేదు. 


లోక్ సభలో బీజేపీ, కాంగ్రెస్ తర్వాత అన్నాడీఎంకే సంఖ్యా బలం అత్యధికం (37 ఎంపీలు) కావడంతో ఆ పార్టీ మద్దతు కూడగట్టాలని టీడీపీ నాయకులు ప్రయత్నించగా.. వారి ఆశ అడియాసే అయ్యింది. కాగా, టీడీపీకి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ప్రకటించడం విశేషం. ఇక  బిజు జనతాదళ్‌ పార్టీ కూడా ఈ అవిశ్వాస తీర్మానంలో ఓటింగ్‌లో పాల్గొనకుండా దూరంగా ఉండాలని భావిస్తోంది.