వాయుసేన కేంద్రాలపై ఉగ్రవాదుల గురి...అప్రమత్తమైన భారత్ !!
భారత వాయు సేన కేంద్రాలపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని ఇంటెలిజెన్సీ నుంచి హెచ్చరికలు రావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
పాక్ ప్రేరేపిత ఉగ్రమూలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. భారత్ చేతిలో ఎన్నిసార్లు చావు దెబ్బలు తిన్పప్పటికీ తమ పంథా మార్చుకోవడం లేదు. ఏదో రకంగా పగ తీర్చుకోవాలనే కసి మాత్రమే కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా భారత్ కు చెందిన వాయుసేన కేంద్రాలను టార్గెట్ చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన ఇంటెలిజెన్సీ వర్గాలు కేంద్రప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. పాక్ ప్రేరేపిత జైషే మహ్మద్ కు చెందిన పదిమంది ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడవచ్చని హెచ్చరికలు జారీ చేశారు.
వాయుసేన కేంద్రాల వద్ద హై అలర్ట్
ఇంటెలిజెన్సీ వర్గాల నుంచి అందిన సమాచారం మేర కేంద్రం ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న వాయు సేన కేంద్రాల వద్ద హైఅలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లోని అమృతసర్, పటాన్‌కోట్, శ్రీనగర్ తదితర భారత వాయుసేన కేంద్రాల వద్ద భద్రతను పెంచారు. ఎలాంటి పరిస్థితులునైనా ఎదుర్కొనేందుకు భారత సైనికులు అప్రమత్తమయ్యారు.
24 గంటల పాటు అప్రమత్తం..
భద్రతా చర్యల్లో భాగంగా శ్రీనగర్, అవంతిపూర్, జమ్మూ, పటాన్ కోట్, హిందన్ వాయుసేన కేంద్రాల్లో ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ సందర్భంగా వాయుసేన కేంద్రాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించారు. దీంతోపాటు ముందు జాగ్రత్తగా పాఠశాలలను మూసివేశారు. 24 గంటలు అప్రమత్తంగా ఉండేలా భద్రతా బలగాలను మోహరించారు.
ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలతో ...
ఇమ్రాన్ ఖాన్ జిహాద్ వ్యాఖ్యలను ఖండిస్తూ భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పాక్ కు ఘాటైన హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. సరిహద్దుల దాడటం భారత్ కు పెద్ద కష్టం కాదని..ఇకనైనా జాగ్రత్త ఉండాలని పాక్ కు వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రగిలిపోతున్న పాకిస్తాన్ ఇలా ఉగ్రవాదులను భారత్ పై ఉసిగొల్పేందుకు సిద్ధపడుతుందని ఇంటలిజెన్సీ వర్గాలు తెలిపారు. దీంతో వాయుసేన కేంద్రాలపై దాడులు జరగవచ్చనే సమాచారంతో ఆయా కేంద్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.