విమానం నుంచి కిందపడ్డ ఎయిర్‌హోస్టెస్
విమానం నుంచి కిందపడ్డ ఎయిర్‌హోస్టెస్
ఎయిరిండియా విమానానికి చెందిన ఓ ఎయిర్‌హోస్టెస్ ప్రమాదవశాత్తు విమానం నుంచి కిందపోయారు. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. వెంటనే ఆమెను సమీపంలోని నానావతి హాస్పిటల్‌కు తరలించామని యాజమాన్యం తెలిపింది.
వివరాల్లోకి వెళితే.. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా ఈ ఘటన జరిగింది. సోమవారం ఉదయం ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఏఐ864 విమానం దాని షెడ్యూల్ ప్రకారం ఉదయం 7 గంటలకు సిద్ధంగా ఉంది. 'ప్రయాణీకులను ఎక్కించే సమయంలో, బోయింగ్ 777 యొక్క ఎల్5 తలుపును తెరిచేందుకు ఎయిర్‌హోస్టెస్ వెళ్ళింది. ఎక్కే నిచ్చెనకు, తెరిచే తలుపుకు మధ్య ఖాళీ ఉంది. ప్రమాదవశాత్తు ఆమె తలపు తెరిచే ప్రక్రియలో తారు రోడ్డుపై కిందపడిపోయారు.' అని ఎయిరిండియా అధికారి చెప్పినట్లు ఏఎన్ఐ తెలిపింది.
ఎయిర్‌హోస్టెస్ కాళ్లకు తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం నానావతి ఆస్పత్రికి తరలించామని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. కాగా ఈ ఘటనతో విమానం గంటపాటు ఆలస్యంగా ప్రయాణించింది.