మద్యం సేవించి విమానాన్ని నడపాలని భావించిన ఓ పైలట్.. బ్రీత్ అనలైజర్ టెస్టులో దొరికిపోవడంతో ఆయనను అధికారులు శిక్షించారు. 787 డ్రీమ్‌లైనర్‌ బోయింగ్ విమానాన్ని సదరు పైలట్ నడపాల్సి ఉంది. కానీ ఆయన మద్యం తాగి  దొరికిపోవడంతో అధికారులు ఆయన లైసెన్స్‌ను మూడేళ్ళ పాటు క్యాన్సిల్ చేశారు. ఆ పైలట్ ప్రతిష్టాత్మకమైన ఎయిర్ ఇండియా సంస్థకు సేవలందిస్తుండడం గమనార్హం. అయితే ఆయన చాలా సీనియర్ పైలట్ అని.. ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి ఫిర్యాదులు లేవని సంస్థ తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయినా సరే.. మద్యాన్ని సేవించి ఆ విషయాన్ని ముందే తెలపకుండా విమానాన్ని నడపాలని ఆయన భావించారు కాబట్టి.. తప్పకుండా ఆయన శిక్ష అనుభవించాల్సిందేనని ఎయిర్ ఇండియా యాజమాన్యం తెలిపింది. కాగా.. పైలట్‌ను అధికారులు అదుపులోకి తీసుకోవడంతో విమానం ఆలస్యమైంది. ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. గంటలపాటు వారు విమానం కోసం ఎదురుచూస్తూ.. విమానాశ్రయంలోనే గడిపారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మళ్లీ పైలట్ల షెడ్యూల్ మార్పించి.. వేరే సీనియర్ పైలట్‌ని ఎయిర్ ఇండియా యాజమాన్యం రప్పించింది. 


కాగా.. ఈ సంఘటన జరిగిన రోజు మరో విమానాశ్రయంలో మరో ఎయిర్ ఇండియా పైలట్ మరో వివాదంలో చిక్కుకున్నారు. బ్రీత్ అనలైజర్ టెస్టుకి హాజరవ్వకుండా ఆయన విమానాన్ని టేకాఫ్ చేశారు. ఆయన ఢిల్లీ నుండి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా పైలట్ కావడం గమనార్హం. అయితే విమానం టేకాఫ్ అయిన అరగంటకే మళ్లీ ఆయనను అధికారులు ఢిల్లీ రప్పించారు. విమానాన్ని వెంటనే ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేయాలని తెలిపారు. దీంతో మళ్లీ గంటల పాటు ప్రయాణికులు ఢిల్లీ చేరుకొని ఎదురుచూడాల్సి వచ్చింది. ఎయిర్ ఇండియా మరో పైలట్‌ని సమకూర్చేసరికి.. ప్రయాణికులు నాలుగు గంటలు విమానాశ్రయంలోనే ఉండిపోయారు. కాగా.. ఎయిర్ ఇండియా సంస్థపై పలువురు ప్రయాణికులు సోషల్ మీడియాలో మండిపడ్డారు.