ఎయిర్‌సెల్-మాక్సిస్ మనీలాండరింగ్ కేసులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌నేత పి. చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంలకు మరోసారి ఊరట లభించింది. ఆగస్టు 7 వరకు మధ్యంతర బెయిల్‌ను పొడగిస్తూ ఢిల్లీ పాటియాలా కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. జులై 10వ తేదీ వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనను అరెస్ట్ చేయరాదంటూ కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే! గడువు ముగియడంతో నేడు కోర్టుకు హాజరైన ఆయనకు మధ్యంతర బెయిల్‌ను పొడగిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కార్తీ చిదంబరం మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ అభియోగ పత్రాలను కోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఇదే కేసులో పి. చిదంబరం కూడా సీబీఐ ముందు హాజరయ్యారు.


ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్తీ చిదంబరంను చెన్నై విమానాశ్రయంలో ఫిబ్రవరి 28న అరెస్టు చేశారు. ఆతరువాత కార్తీ బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా ఇదే కేసులో చిదంబరం అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2006లో చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో దాదాపు రూ.600  కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపిబి) ద్వారా అక్రమ విదేశీ నిధులను స్వీకరించారని ఆరోపిస్తూ సీబీఐ గత మే 15న కేసు నమోదు చేసింది.