విమాన ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ !
విమాన ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ !
తరచుగా విమాన ప్రయాణాలు చేసేవారికి ఇదో బ్యాడ్ న్యూస్. ప్రయాణికులకు మేలు చేకూరేలా కొత్త పాలసీలు అమలు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మే నెలలో విమానయాన సంస్థలకు పలు ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, గత కొన్నేళ్లలో విమానయాన రంగంలో ఎంతో అభివృద్ధి నమోదైనప్పటికీ.. ఇటీవల కాలంలో పెరిగిన ఇంధనం ధరలను సాకుగా చూపి నష్టాలనే చూపిస్తున్న పలు విమానయాన సంస్థలు ఆ ప్రతిపాదనలను అమలు చేయడం తమ వల్ల కాదంటూ చేతులెత్తేశాయి. హిందుస్తాన్ టైమ్స్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం.. విమానయాన శాఖ చేసిన ఆ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాల్సిందిగా కానీ లేని పక్షంలో ఇంకొంత కాలంపాటు ఆ ప్రతిపాదనలను వాయిదా వేయాల్సిందిగా విమానయాన సంస్థలు కేంద్రంపై తాజాగా మరోసారి ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. దీంతో త్వరలోనే ప్రయాణికులకు మేలు చేకూర్చే ఆ ప్రతిపాదనలు అమలులోకి రాకుండానే మళ్లీ అటకెక్కినట్టు సమాచారం.
ప్రయాణికుల సౌకర్యార్ధం విమానయాన సంస్థలకు కేంద్రం చేసిన ప్రతిపాదనల విషయానికొస్తే, ఏదైనా కారణాల వల్ల విమానం బయల్దేరడం ఆలస్యమైనా, అలా ఆలస్యమైన విమానం కారణంగా మరో చోట ఎక్కాల్సిన విమానాన్ని సమయానికి అందుకోలేకపోయినా, ఏదైనా విమానం రద్దయినా, ప్రయాణికులు విమానం టికెట్‌ని క్యాన్సిల్ చేసుకునే సందర్భాలు, లగేజీ అదృశ్యం, లగేజీ డ్యామేజీ వంటి సమస్యలకు కేంద్రం ఈ ప్రతిపాదనల్లో పలు పరిష్కారాలు సూచించింది. ఆయా సమస్యల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ఎయిర్ లైన్స్ సంస్థలు ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించేలా కేంద్రం ఈ ప్రతిపాదనలు రూపొందించింది.
అయితే, అవి అమలులోకి వస్తే, తమ వ్యాపారంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయనే భయంతోనే ఎయిర్ లైన్స్ సంస్థలు ఆ ప్రతిపాదనలను అటకెక్కించేలా తిరిగి కేంద్రంపైనే ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.