ఉద్ధవ్ థాకరేకు షాకిచ్చిన అజిత్ పవార్ అభిమానులు
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాకరే గురువారం ప్రమాణ స్వీకారం చేయనుండగా అంతకన్నా ఒక్క రోజు ముందుగా బుధవారం నాడు అజిత్ పవార్ నియోజకవర్గమైన బారామతి నుంచి శివ సేనకు మరో కొత్త షాక్ తగిలింది.
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాకరే(UddhavThackeray as CM) గురువారం ప్రమాణ స్వీకారం చేయనుండగా అంతకన్నా ఒక్క రోజు ముందుగా బుధవారం నాడు అజిత్ పవార్ నియోజకవర్గమైన బారామతి నుంచి శివ సేనకు మరో కొత్త షాక్ తగిలింది. ఇదివరకు శివ సేనకు అధికారం చేపట్టే అవకాశం వస్తే.. అప్పుడు అజిత్ పవార్ రూపంలో గండిపడగా.. తాజాగా అజిత్ పవార్ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ కార్యకర్తలు శివసేన అధినేత, కాబోయే ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు షాకిచ్చారు. అజిత్ పవారే మహారాష్ట్రకు కాబేయే ముఖ్యమంత్రి అంటూ రాసి ఉన్న పోస్టర్లు బారాముల్లాలో ప్రత్యక్షమవడం కలకలం సృష్టించింది. బారాముల్లాలో పోస్టర్ల కలకలం వెనుక అజిత్ పవార్ హస్తం ఏమైనా ఉందా అనేదే ప్రస్తుతం శివ సేనతో పాటు రాజకీయ పరిశీలకుల మదిలోనూ మెదులుతున్న ప్రశ్న. అయితే, అజిత్ పవార్ మాత్రం పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా.. వాటిని నిర్వహించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించడం గమనార్హం.
Read also : కేబినెట్ పంపకాల కోసం శరద్ పవార్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు
బీజేపి, ఎన్సీపీ నేత అజిత్ పవార్ కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వం మెజారిటీ లేని కారణంగా ప్రభుత్వం నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు శివ సేన అధినేత ఉద్ధవ్ థాకరేకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ఇవ్వడమే కాకుండా.. రాబోయే ఐదేళ్లకు థాకరేనే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్పష్టంచేశాయి.