రాహుల్‌తో నా స్నేహం చూసి బీజేపీ భయపడుతోంది: అఖిలేష్ యాదవ్
సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను రాహుల్‌తో స్నేహం చేయడం చూసి బీజేపీ భయపడుతోందని ఆయన అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు మరియు ఉత్తర ప్రదేశ్ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ వల్లంత్ పంత్ జయంతి వేడుకలను ప్రారంభించిన ఆయన.. ఆ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో సోమవారం నుండి ప్రారంభమయ్యే ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) కార్యక్రమాలకు హాజరు కావడం లేదని తెలిపారు.
"నాకు ఆర్ఎస్ఎస్ మీద ఎలాంటి నాలెడ్జి లేదు. నేను కేవలం సర్దార్ పటేల్ ఆర్ఎస్ఎస్‌ను ఎందుకు బ్యాన్ చేశారో మాత్రమే చదివాను. అది చదివాక..నేను ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు వెళ్లే ధైర్యం ఏ మాత్రం చేయలేదు" అని అఖిలేష్ యాదవ్ అన్నారు. "సర్దార్ పటేల్ గారు ఆర్ఎస్ఎస్‌ను ఎందుకు బ్యాన్ చేయమన్నారో ఈ రోజు దేశ ప్రజానీకం మొత్తం తెలుసుకోవాలి. ఆయన అప్పటి పరిస్థితులను బట్టి ఆ మాటలు అన్నారు. కానీ చిత్రమేంటంటే అప్పటికీ ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ విషయంలో పటేల్ గారు ప్రస్తావించిన పరిస్థితులు మారలేదు" అని అఖిలేష్ తెలిపారు.
అదేవిధంగా.. అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ వారి ప్రశ్నలకు కూడా జవాబిచ్చారు. కుటుంబ కలహాల వల్లే గతంలో సమాజ్ వాదీ పార్టీ చీలిపోయే పరిస్థితి తలెత్తింది కదా? అని సంధించిన ప్రశ్నకు జవాబిస్తూ.. "ఏ కుటుంబంలో గొడవలు లేవు. అన్ని కుటుంబాల్లోనూ గొడవలు రావడం సహజం. అలాగే అవి సద్దుమణగడం కూడా సహజమే" అన్నారు. అలాగే ప్రధాని మోదీని ఉద్దేశించి కూడా మాట్లాడుతూ "కుటుంబమే లేని మనిషికి.. కుటుంబంతో గొడవ పడే అవకాశం కూడా రాదు కదా" అన్నారు. బీజేపీ గత ఎన్నికల్లో కుల,మత రాజకీయాల వల్ల చీల్చిన ఓట్లతో గెలిచిందని.. కానీ ఈసారి ఆ పరిస్థితి మారుతుందని తెలిపారు.