నెహ్రూ విగ్రహం తొలగింపుపై స్పందించిన యూపీ సర్కార్
యూపీలో మాజీ ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ విగ్రహం తొలగింపుపై చెలరేగిన దుమారం
ఉత్తర్ ప్రదేశ్ అలహాబాద్‌లోని బల్సన్ క్రాసింగ్ వద్ద రోడ్డు పక్కనే ఉన్న జవహార్ లాల్ నెహ్రూ విగ్రహాన్ని పక్కకు జరపడంపై రాజకీయవర్గాల్లో పెను దుమారంరేగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌పై కక్షసాధింపు దోరణితోనే మాజీ ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ విగ్రహాన్ని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ పక్కకుపెట్టించిందని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో తాజాగా అలహబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏడీఏ) స్పందించింది. కేవలం రానున్న కుంభమేళాను దృష్టిలో పెట్టుకుని బల్సన్ క్రాసింగ్ వద్ద పార్కుకు సమీపంలో రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్న కారణంగానే నెహ్రూ విగ్రహాన్ని 30 మీటర్ల దూరంలోకి మార్చడం జరిగిందే తప్ప ఇందులో దురుద్దేశం లేదని అలహాబాద్ డెవలప్‌మెంట్ అథారిటి వివరణ ఇచ్చింది.
మాజీ ప్రధాని జవహార్ లాల్ నెహ్రూపై తమకు పూర్తి గౌరవం ఉందని అలహాబాద్ డెవలప్‌మెంట్ అథారిటి ఈ ప్రకటనలో పేర్కొంది. అలహాబాద్ డెవలప్‌మెంట్ అథారిటి ఇచ్చిన ఈ వివరణపై కాంగ్రెస్ ఏమని స్పందించనుందో వేచిచూడాల్సిందే మరి.