చారిత్రక నగరం అలహాబాద్ పేరు అధికారికంగా మంగళవారం ' ప్రయాగ్‌రాజ్‌'గా మార్చబడింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్ చారిత్రక నగర పేరు మార్చాలని చేసిన ప్రతిపాదనను నేడు ఆమోదించింది. "అలహాబాద్ నగరాన్ని ఈ రోజు నుండి ప్రయాగ్‌రాజ్‌ అని పిలుస్తారు." రాష్ట్ర మంత్రి మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ క్యాబినెట్ సమావేశం తరువాత లక్నోలో తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాంగ్రెస్ మరియు సమాజ్వాదీ పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీల నిరసనల మధ్య యోగి క్యాబినెట్ ఈ ప్రతిపాదనను ఆమోదించింది. సంగం సిటీ అని కూడా పిలువబడే అలహాబాద్ పేరును మార్చడంపై మేధావులు, ఉపాధ్యాయులు, సామాన్య ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోందని జాతీయ మీడియా కథనం.


దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఈ నగరం ముఖ్యపాత్ర పోషించిందని, పేరు మార్చడం అంటే నగర ప్రాముఖ్యతను తగ్గించడమే అని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. అటు అలహాబాద్ పేరును యోగి ప్రభుత్వం మార్చడంపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. యోగి ప్రభుత్వం ఊర్ల పేర్లు మార్చడమే పనిగా పెట్టుకున్నట్లు ఎద్దేవా చేశారు.


శనివారం, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అలహాబాద్‌లో పర్యటిస్తూ.. 'విస్తృత ఏకాభిప్రాయం తర్వాతే అలహాబాద్‌ పేరును మారుస్తాం. ప్రయాగ్‌రాజ్‌గా మార్చాలన్నది ఎక్కువ మంది ప్రజల ఆకాంక్ష. అందరూ అంగీకరిస్తే ప్రయాగ్‌రాజ్‌గా మారుస్తాం’ అని తెలిపారు. 2019లో ఇక్కడ జరగనున్న కుంభమేళాకు ముందుగానే కొత్తపేరు ప్రయాగ్‌రాజ్‌ను ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.


ఇంధన మంత్రి, ప్రభుత్వ ప్రతినిధి శ్రీకాంత్ శర్మ ఈ చర్యను సమర్ధించారు. "అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా మార్చేందుకు కొంతమంది వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అభ్యంతరాలు నిరాధారమైనది. నగరాల పేర్లను మార్చే అధికారం ప్రభుత్వానికి ఉంది. అవసరమైతే మరిన్ని నగరాలు, రహదారుల పేర్లను మారుస్తాం. ఇదివరకు చేసిన తప్పులు సరిదిద్దబడతాయి.' అని శర్మ చెప్పారు.


రాష్ట్ర గవర్నర్ రామ్ నాయక్ కూడా సంగం నగరానికి చెందిన ప్రజలు, సన్యాసుల నుంచి వచ్చిన డిమాండ్లను సమర్ధించినట్లు మంత్రి తెలిపారు.