Amar Jawan Jyoti: ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద 50 ఏళ్లుగా వెలుగుతున్న అమర్ జవాన్ జ్యోతిని ఆర్పేయనున్నారనే ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. అమర జవాన్ జ్యోతిని ఆర్పేయట్లేదని.. పక్కనే 'జాతీయ యుద్ధ స్మారకం' వద్ద ఉండే జ్యోతిలో దాన్ని విలీనం చేయనున్నట్లు వెల్లడించింది. అమర జవాన్ జ్యోతి వెలిగే చోట అమర జవాన్ల పేర్లు లిఖించబడి లేవని... అలాంటిచోట వారికి నివాళులు అర్పించడం సరిగా లేదని కేంద్రం పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జాతీయ యుద్ధ స్మారకం వద్ద 1971 వార్‌తో పాటు అంతకుముందు, ఆ తర్వాత అమరులైన జవాన్ల పేర్లు లిఖించబడి ఉన్నాయని కేంద్రం పేర్కొంది. అలాంటి చోట అమర జవాన్లకు నివాళులు అర్పించడమే నిజమైన శ్రద్ధాంజలి అవుతుందని తెలిపింది. అమర జవాన్ జ్యోతిని ఆర్పేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేసిన విమర్శలను కేంద్రం తిప్పికొట్టింది. 'ఏడు దశాబ్దాలుగా జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మించలేనివారు.. ఇప్పుడు అమర జవాన్లకు శాశ్వతమైన, నిజమైన నివాళి అర్పించేందుకు కేంద్రం సిద్ధమవుతుంటే అనవసర రాద్ధాంతం చేస్తున్నారు...' అని కేంద్రం మండిపడింది.


50 ఏళ్ల క్రితం 1971లో ఇండియా-పాక్ వార్‌లో అమరులైన జవాన్లకు గుర్తుగా ఇండియా గేట్ వద్ద స్మారకాన్ని నిర్మించారు. జనవరి 26, 1972న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అమర జవాన్ జ్యోతిని వెలిగించారు. అప్పటినుంచి ఇప్పటివరకూ ఆ జ్యోతి నిర్విరామంగా వెలుగుతూనే ఉంది. తాజాగా కేంద్రం ఆ జ్యోతిని ఆర్పేయాలని నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. దీంతో ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పించాయి. 'కొంతమందికి దేశభక్తి, సైనికుల త్యాగం ఎన్నటికీ అర్థం కావు.. అమర జవాన్ జ్యోతిని ఆర్పేయాలనుకోవడం బాధ కలిగిస్తోంది.. అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. 


తాజాగా కేంద్రం చేసిన ప్రకటనతో అమర జవాన్ జ్యోతిని (Indian Army) ఆర్పేస్తున్నారనే ప్రచారానికి తెరపడినట్లయింది. నేటి మధ్యాహ్నం 3.30గంటలకు అమర జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉన్న జ్యోతితో విలీనం చేయనున్నట్లు సమాచారం.


Also Read: T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?! అభిమానులకు పండగే పో!