న్యూ ఢిల్లీ: పార్లమెంట్‌లో శీతాకాల సమావేశాల తొలిరోజైన సోమవారం ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ రాజ్య సభలో సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ.. నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ పార్టీ(ఎన్సీపీ), బిజు జనతా దళ్ (బీజేడీ) పార్టీలు పార్లమెంట్ సభా మర్యాదలను కాపాడటంలో నిబద్ధత చూపించాయని ప్రశంసించారు. ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు ఎవ్వరూ ఇన్నేళ్లకాలంలో వెల్‌లోకి వెళ్లకుండానే అనేక సమస్యలపై తమ ధ్వని వినిపించడంలో సఫలమయ్యారని ప్రధాని మోదీ కొనియాడారు. సభలో గందరగోళం సృష్టించకుండా సభలో ప్రజా సమస్యలను ఎలా వినిపించాలనే విషయంలో బీజేపి సహా ఇతర పార్టీల సభ్యులు ఎవరైనా ఆ పార్టీలను చూసి నేర్చుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుంటే, ఓవైపు మహారాష్ట్రలో సర్కార్ ఏర్పాటు విషయంలో బీజేపికి వ్యతిరేకపక్షంలో వున్న ఎన్సీపీ.. ప్రభుత్వం ఏర్పాటు కోసం శివ సేన, కాంగ్రెస్ పార్టీలతో జత కట్టిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో బీజేపికి వ్యతిరేక పక్షంతో ఎన్సీపీ చేతులు కలిపిన ప్రస్తుత నేపథ్యంలోనూ ప్రధాని మోదీ ఆ పార్టీని కొనియాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.