సీనియర్ ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేసిన కర్ణాటక సీఎం
కర్ణాటక రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే మెజారిటీ నిరూపించుకొని సీఎం కుర్చీలో శాశ్వతంగా ఉండాలని ఇరు పార్టీలు భావిస్తున్న వేళ.. కొత్త సీఎం యడ్యూరప్ప సరికొత్త నిర్ణయాలు తీసుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
కర్ణాటక రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే మెజారిటీ నిరూపించుకొని సీఎం కుర్చీలో శాశ్వతంగా ఉండాలని ఇరు పార్టీలు భావిస్తున్న వేళ.. కొత్త సీఎం యడ్యూరప్ప సరికొత్త నిర్ణయాలు తీసుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. తాను సీఎం పదవిని చేపట్టి కనీసం రెండు రోజులు కూడా పూర్తవ్వకుండానే ఆయన సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
అందులో భాగంగానే బదిలీల ప్రక్రియను చేపట్టారు. కర్ణాటకలోని సీనియర్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల్లో చాలామందిని బదిలీ చేస్తూ.. మరికొందరికి శాఖలు మారుస్తూ ఆయన సరికొత్త నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే సీఎం ఆఫీసుకు కొత్త అడ్వకేట్ జనరల్‌ను కూడా ఆయన అపాయింట్ చేశారు. సీనియర్ అడ్వకేట్ ప్రభులింగ్ కే నవదాగికి ఆయన ఈ బాధ్యతలు అప్పగించారు. పదవీ విరమణ చేసిన మధుసూదన్ ఆర్ నాయక్ స్థానంలో ఆయన నవదాగిని తీసుకున్నారు.
అలాగే ఎం లక్ష్మీ నారాయణను ఆయన తనకు అడీషనల్ చీఫ్ సెక్రటరీగా నియమించుకున్నారు. అలాగే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లైన అమర్ కుమార్ పాండే, సందీప్ పాటిల్, ఎస్ గిరీష్ లాంటి వారిని ఆయన వేరే శాఖలకు బదిలీ చేశారు.
ప్రస్తుతం బీజేపీ తరఫున కేవలం 104 ఎమ్మె్ల్యేలే ఉండగా.. ఇంకా ఆ పార్టీకి 8 ఎమ్మెల్యేలు తక్కువ కావడంతో.. మ్యాజిక్ ఫిగర్‌కి దూరంగా ఉండిపోయింది. సుప్రీంకోర్టు శనివారం సాయంత్రం 4 గంటలకు బలపరీక్షలో ఇరు పార్టీలకు మెజారిటీ నిరూపించుకోమని ఆదేశించిన తరుణంలో కొత్త సీఎం ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకోవడం పలువురిని ఆశ్చర్యపరిచింది.