తొలిసారి లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన అమిత్ షా
లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన అమిత్ షా
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శనివారం గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్ సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అమిత్ షా లోక్ సభకు పోటీ చేయడం ఇదే మొదటిసారి. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రె వంటి అగ్రనేతలు అమిత్ షా నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆయన వెంట ఉన్నారు. బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వాని ప్రస్తుతం ఇదే లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీజేపీ తనకు కల్పించిన స్థానానికి తాను రుణపడి ఉంటానని చెబుతూ.. పార్టీని తన జీవితంలోంచి పక్కనపెడితే, తన జీవితం శూన్యమే అని అన్నారు. తాను ఏం నేర్చుకున్నా.. దేశానికి ఏం ఇచ్చినా అదంతా బీజేపి పుణ్యమే అని అమిత్ షా అభిప్రాయపడ్డారు.
ఎల్.కె. అద్వాని, అటల్ బిహారి వాజ్‌పేయి వంటి అగ్రనేతలను లోక్ సభకు పంపించిన గాంధీనగర్ నుంచే తనకు కూడా ఎంపీని అయ్యే అవకాశం రావడం ఎంతో ఆనందానికి గురిచేస్తోందన్నారు. దీన్ దయాల్ గారి సిద్ధాంతాలతో ముందుకు వెళ్తున్న బీజేపి వల్లే దేశంలో అభివృద్ధి సాధ్యం అని అమిత్ షా పేర్కొన్నారు. నామినేషన్ కన్నా ముందుగా ఆయన భారీ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు.