ఢిల్లీ నుంచి విశాఖపట్టణంకు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రైలులో నాలుగు ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. ఒక ఏసీ బోగీతో పాటు మరో బోగీ పూర్తిగా దగ్ధమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోమవారం ఉదయం ఢిల్లీలో ఏపీ ఎక్స్ ప్రెస్ బయలుదేరింది. గ్వాలియర్ ప్రాంతానికి సమీపిస్తున్న సయమంలో, బిర్లా నగర్ రైల్వే స్టేషన్ వద్ద ఒక్కసారిగా ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. మంటలు డోర్లు, కిటికీలకు వ్యాపించాయి. ఏసీ బోగీల్లో మంటలు వ్యాపించిన సమాచారం తెలుసుకున్న సంబంధిత అధికారులు రైలును వెంటనే నిలిపివేశారు. ఈ సంఘటనతో భయపడిపోయిన ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు.


అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని భారతీయ రైల్వే తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. ఎయిర్ కండీషన్ లోపం వల్ల ఈ ఘటన జరిగి ఉండవచ్చని నివేదికలు పేర్కొన్నాయి. ఘటనకు సంబంధించి  మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


కాగా ఈ ఘటనతో ఆ మార్గంలో వెళ్లే రైళ్ళను రైల్వే శాఖ ఆపేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు.