న్యూఢిల్లీ: కొత్త మోటార్ వాహనాల చట్టం 2019 కింద ట్రాఫిక్ పోలీసులు విధిస్తున్న చలానాలు వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. తమ వాహనం విలువ కన్నా అధిక మోతాదులో బాదుతున్న ట్రాఫిక్ చలానాలు కొంతమంది వాహనదారులను తీవ్ర అసహనానికి గురిచేస్తున్నాయి. తాజాగా ఢిల్లీలోని షేక్ సరాయి ఫేస్ 1 వద్ద ఓ మోటార్ బైక్‌ని ఆపిన ట్రాఫిక్ పోలీసులు.. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్నావంటూ చలానా విధించారు. ఆ చలానా చూసి తిక్కరేగిన సదరు వాహనదారుడు.. వెంటనే అదే చోట తన ద్విచక్రవాహనానికి నిప్పంటించి తగలబెట్టేశాడు. నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గురువారం నాడు రోడ్డుపై పబ్లిగ్గా జరిగిన ఈ ఘటన చూసి జనమే విస్తుపోయారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దిచక్రవాహనదారుడి ప్రవర్తన చూసిన పోలీసులు.. అతడు మద్యం మత్తులో ఉన్నాడనే అనుమానంతో వైద్య పరీక్షల నిమిత్తం అతడిని తమ అదుపులోకి తీసుకున్నారు. 


ఇదిలావుంటే, ఇటీవలే ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లోనూ ఇదే తరహాలో ఓ ఆటోవాలాపై రూ.47,500 చలానా విధించిన వైనం అందరినీ షాక్‌కి గురిచేసిన సంగతి తెలిసిందే. బతుకుదెరువు కోసం ఆటో కొనుక్కున్న తనపై ట్రాఫిక్ చలానా పిడుగులా పడిందని ఆటోవాలా వాపోయాడు.