రాహుల్ గాంధీకి అనిల్ అంబానీ లేఖ: రాఫెల్ ఒప్పందంపై ఆసక్తికర వ్యాఖ్యలు
రాఫెల్ ఒప్పందం పై కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న క్రమంలో.. పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఇదే విషయంపై రాహుల్ గాంధీకి రాసిన లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది.
రాఫెల్ ఒప్పందం పై కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న క్రమంలో.. పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఇదే విషయంపై రాహుల్ గాంధీకి రాసిన లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. డిసెంబరు 12, 2017 తేదిన రాసిన ఆ లేఖలో అనిల్ అంబానీ పలు విషయాలను తెలిపారు. ఆ లేఖలో ఆయన గాంధీ కుటుంబంపై తనకు ఎనలేని అభిమానం ఉందని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేయడం తనను బాధించాయని ఆయన తెలిపారు.
డస్టాల్ కంపెనీ, రిలయెన్స్ డిఫెన్స్ సంస్థతో కలిసి ఒప్పందం చేసుకోవడంలో ప్రభుత్వ పాత్ర ఏమీ లేదని అనిల్ అంబానీ పేర్కొన్నారు. రిలయెన్స్ సంస్థతో ఆయా కంపెనీకి జరిగిన ఒప్పందం.. ఓ ప్రైవేటు ఒప్పందం మాత్రమేనని ఆయన అన్నారు. అలాగే రిలయెన్స్ డిఫెన్స్ సంస్థ గుజరాత్‌లోని పిపావావ్ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద షిప్ యార్డ్‌కి యజమానిగా కూడా ఉందని ఆయన గుర్తుచేశారు. అదేవిధంగా, భారత ప్రభుత్వం ఫ్రాన్స్ నుండి 36 రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోలు చేయడానికి చేసుకున్న ఒప్పందం కేవలం ఆ ఇరు దేశాలు చేసుకున్న అగ్రిమెంట్ మాత్రమేనని.. అందులో రిలయెన్స్‌కు ఎలాంటి పాత్ర కూడా లేదని అంబానీ స్పష్టం చేశారు.
అయితే.. రిలయెన్స్ అధినేత అనిల్ అంబానీ లేఖ పై రాహుల్ సంతృప్తి చెందలేదు. అంబానీకి లాభం చేకూర్చేందుకే ఎన్‌డీఏ జెట్ల కొనుగోలు ధరను పెంచిందని రాహుల్ ఆరోపణలు చేశారు. రాఫెల్ ఒప్పందాన్ని ఒక అతి పెద్ద కుంభకోణంగా ఆయన పేర్కొన్నారు. ఈ కుంభకోణం గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీకి తెలుసని చెబుతూ రాహుల్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అప్పుల్లో చిక్కుకున్న ఓ ప్రైవేటు కంపెనీకి లబ్ది చేకూర్చడం కోసమే మోదీ సర్కారు ఈ కుంభకోణానికి నాంది పలికిందని కూడా రాహుల్ తెలిపారు.