గత ఏడేళ్ళుగా అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని కొనసాగిస్తున్న సామాజికవేత్త అన్నా హజారే ఈ రోజు దేశ రాజధానిలో సత్యాగ్రహం చేయడానికి సిద్ధమయ్యారు. గతంలో కాంగ్రెస్  ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన హజారే ఈ సారి నరేంద్ర మోదీ సర్కారుకి వ్యతిరేకంగా చేస్తున్నట్లు ప్రకటించారు. 2011లో ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో తొలిసారిగా నిరాహారదీక్ష చేశారు హజారే. ఈ రోజు కూడా అక్కడే దీక్ష చేయనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రవారం మీడియాతో అన్నాహజారే మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తన మద్దతుదారులు ఢిల్లీ రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటుందని.. అందుకే రైళ్ళను క్యాన్సిల్ చేస్తుందని ఆరోపించారు. అలాగే పోలీసులను కూడా భారీగా మోహరించడం వెనుక ఉద్యమాన్ని నీరుగార్చాలనే వ్యూహం దాగుందని తెలిపారు. తాను గతంలో కూడా తనకు ఎలాంటి పోలీస్ రక్షణ వద్దని ప్రభుత్వానికి తెలిపానని ఆయన అన్నారు. ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వం అవినీతిని అంతమొందించడం కోసం లోక్ పాల్ ఇంకా ఎందుకు ప్రవేశపెట్టలేదని ఆయన ప్రశ్నించారు.


ఈ రోజు తాను తొలుత రాజ్ ఘాట్ వద్దకు వెళ్ళి.. ఆ తర్వాత రాంలీలా మైదాన్ వద్దకు వెళ్లి అక్కడి నుండి దీక్ష ప్రారంభిస్తానని ఆయన తెలిపారు. మార్చి 23 తేదినే ఎంచుకోవడానికి కూడా ఓ కారణముందని ఆయన తెలిపారు. ఇదే రోజు భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజగురులు బ్రిటీష్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉరితీయబడ్డారని ఆయన అన్నారు. 2011లో అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం ప్రారంభించినప్పుడు దేశనలుమూలల నుండి కూడా విపరీతమైన మద్దతు వచ్చింది.