TTD Rejects Telangana Letters: దేశంలోనే ప్రఖ్యాతి చెందిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నా కూడా తెలంగాణతో విడదీయరాని అనుబంధం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తిరుమలను సొంత క్షేత్రంగా తెలంగాణ ప్రజలు భావించారు. కానీ ఇప్పుడు రాష్ట్రాలుగా విడిపోయినా తిరుమలను పంచుకోలేదు. టీటీడీపై పూర్తి హక్కు ఆంధ్రప్రదేశ్‌కే ఉన్నా పొరుగు రాష్ట్రం తెలంగాణ వారికి కొంత న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. పొరుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటే తెలుగు ప్రజలకు మేలు జరుగుతుందనే అభిప్రాయం ప్రస్తుతం తిరుమల విషయంలో ఏర్పడింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక తిరుమలపై మళ్లీ రాజకీయాలు అలుముకున్నాయి. ఒక్క రాజకీయాలే కాదు ప్రాంతీయ వివక్ష కూడా ఏర్పడిందనే అభిప్రాయం వస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజాప్రతినిధులు తిరుమల అధికారులపై మండిపడడం నిదర్శనం. అసలేం జరిగింది? తిరుమలపై తెలంగాణ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక కారణం ఏమిటో తెలుసుకుందాం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Telangana DAs: పెండింగ్‌లో ఉద్యోగుల ఐదు డీఏలు.. రేవంత్‌ సర్కార్‌కు ఆల్టిమేటం


తిరుమల క్షేత్రంలో దర్శనాలకు సంబంధించి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలు ఉంటాయి. ఏపీతోపాటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సులు కూడా చెల్లుబాటు అవుతుంటాయి. ఏపీ, తెలంగాణ విడిపోయినా కూడా కొన్నాళ్లు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు చెల్లుబాటయ్యాయి. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం లేఖలకు అంగీకరించడం లేదు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు ఆమోదం లభించడం లేదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిఫార్సు చేసినా కూడా టీటీడీ అధికారులు ఆమోదించడం లేదు. ఈ వ్యవహారం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో రేవంత్‌ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం. అయినా కూడా ఈ సమస్య కొలిక్కి రాలేదు.

Also Read: Power Bill Hike: దీపావళికి రేవంత్ రెడ్డి విద్యుత్ ఛార్జీల భారం మోపితే చూస్తూ కూర్చోలేం: కేటీఆర్


టీటీడీ వ్యవహరిస్తున్న వివక్షపై తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్నాళ్లు సిఫార్సు లేఖలు ఆమోదించి ఇప్పుడు ఆమోదించకపోవడాన్ని ఖండిస్తున్నారు. ఇటీవల తెలంగాణలోని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ తిరుమలను సందర్శించారు. ఈ సమయంలో మీడియా ముందు మాట్లాడుతూ టీటీడీ వైఖరిని తప్పుబట్టారు. తిరుమలలో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు విలువ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


'తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు విలువ లేదు. తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల లెటర్ ప్యాడ్స్ టీటీడీ ఈఓ తీసుకోవడం లేదు. అదే ఏపీ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల లెటర్ ప్యాడ్స్ తెలంగాణలోని భద్రాద్రి, యాదాద్రి, కొండగట్టు ఆంజనేయస్వామి, కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాల దగ్గర తీసుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వం దీనిపై స్పందించి టీటీడీలో మా లెటర్ ప్యాడ్స్ తీసుకోవాలి' అని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కోరారు.


'తిరుమల ఆలయానికి తెలంగాణ నుంచి లేఖలు వస్తే ఈఓ ఆమోదించడం లేదు. ఇదే ఆంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణలోని యాదాద్రి, భద్రాచలం ఈఓలకు ఫోన్‌ చేస్తే ప్రత్యేక దర్శనాలు అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు కేవలం వ్యాపారం కోసమే తెలంగాణకు రాకండి.. మేము చెప్తే తిరుమల దర్శనం జరిగేటట్లు ఈఓకు ఆదేశాలు ఇవ్వాలి' అని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి డిమాండ్‌ చేశారు. 'పరిస్థితి మారకపోతే మేము కూడా కలిసి నిర్ణయం తీసుకొని మిమ్మల్ని బహిష్కరిస్తా. భద్రాచలం, యాదాద్రిలో సిఫార్సు లేఖలపై దర్శనం జరగకుండా చేస్తాం' అని హెచ్చరించారు.


ఇలా తెలుగు రాష్ట్రాల మధ్య ఆలయాల వివాదం జరగడం చర్చనీయాంశంగా మారింది. ఆలయాల విషయంలో పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు ఈ వివాదం చోటుచేసుకోవడం హాట్‌ టాపిక్‌ అయ్యింది. తిరుమలను చంద్రబాబు రాజకీయానికి వాడుకుంటుండగా.. ఇప్పుడు తిరుమల కేంద్రంగా ప్రాంతీయ వివక్ష చూపిస్తున్నారని తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. ఇదే వైఖరి కొనసాగిస్తే త్వరలోనే తిరుమలపై తెలంగాణ ప్రజాప్రతినిధులు సంచలన నిర్ణయం తీసుకునేందుకు కూడా వెనుకాడని పరిస్థితి ఏర్పడనుంది.






స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter