తమిళనాడులోని స్టెరిలైట్ రాగి ఫ్యాక్టరీని మూసివేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళనలు చేసిన క్రమంలో వారిని చెదరగొట్టేందుకు పోలీసు బలగాలు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆ కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ విషయంపై తమిళనాడు సీఎం పళనీస్వామి స్పందించారు. ఇందులో పోలీసుల తప్పేమీ లేదని అన్నారు. కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు ప్రజలను రెచ్చగొట్టాయని.. ఈ క్రమంలో భయంకర పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకే పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని సీఎం తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర హోంశాఖ స్టైరిలైట్ ఆందోళనలకు సంబంధించి జరిగిన మారణహోమానికి కారణాలను అడుగుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక సమర్పించాలని కోరిన క్రమంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. "కొన్ని రాజకీయ పార్టీలు, ఎన్జీఓలతో పాటు అసాంఘిక శక్తులు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాయి. ఈ క్రమంలో వారు ఆగ్రహానికి లోనయ్యి శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేశారు. అందుకే పోలీసులు పరిస్థితిని చక్కదిద్దడానికి రంగంలోకి దిగాల్సి వచ్చింది" అని తమిళనాడు సీఎం పళనీస్వామి తెలిపారు.


"ఎవరైనా అనుకోని దాడి చేస్తున్నప్పుడు.. తిరిగి ఎదుర్కోవడం అనేది ఆత్మరక్షణ క్రిందకే వస్తుంది. స్టెరిలైట్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారిని చెదరగొట్టేందుకు పోలీసులు చేసిన పని కూడా అలాంటిది. అయితే ఈ ఘటనను ఆసరాగా చేసుకొని పలువురు విషయాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు" అని అన్నారు. ఈ రోజు ఉదయం డీఎంకే నేత స్టాలిన్ జరిగిన ఘటనకు బాధ్యత వహిస్తూ.. ముఖ్యమంత్రి పళనీస్వామి సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.